ఓ అద్భుత నవలా శకం ముగిసింది. కొన్ని దశాబ్దాలు పాఠకులని అలరించిన కలం సెలవు తీసుకుంది. ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో తన కూతురి నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రచించిన అగ్నిపూలు, మౌనపోరాటం, అమృతధార, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, విజేత వంటి ఎన్నో నవలలు ప్రాచూర్యం పొందాయి. ఆమె నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు, అనేక టీ.వీ ధారావాహికలు కూడా వచ్చాయి.
ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని యద్దనపూడి సులోచనారాణి నిరూపించారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించారు.
సీఎంలు సంతాపం
ప్రముఖ నవలా రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి హఠాత్మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సాహితీలోకానికి తీరని లోటన్న ఆయన.. ఆమె కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ నవలా రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి హఠాత్మరణం పట్ల ముఖ్యమంత్రి క్లల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. తెలుగు సాహితీ వికాసానికి సులోచనారాణి నవలలు ఉపయోగపడ్డాయని చెప్పిన కేసీఆర్ సులోచనారాణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.