భారతీయుల మానస సరోవర యాత్రను అడ్డుకుంటున్న చైనా బలగాలు

కైలాష్ మానస సరోవర యాత్రకు వెళ్తున్న భారతీయ యాత్రికుల ఫిర్యాదులతో ఇప్పుడు విదేశాంగ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏఎన్‌ఐ వార్తా విభాగం అందించిన తాజా సమాచారం ప్రకారం.. మానస సరోవరంలో స్నానమాచరించేందుకు వెళ్తున్న యాత్రికులను చైనాకి చెందిన అధికారులు అడ్డుకుంటున్నారట. 

Last Updated : May 28, 2018, 06:21 PM IST
భారతీయుల మానస సరోవర యాత్రను అడ్డుకుంటున్న చైనా బలగాలు

కైలాష్ మానస సరోవర యాత్రకు వెళ్తున్న భారతీయ యాత్రికుల ఫిర్యాదులతో ఇప్పుడు విదేశాంగ శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏఎన్‌ఐ వార్తా విభాగం అందించిన తాజా సమాచారం ప్రకారం.. మానస సరోవరంలో స్నానమాచరించేందుకు వెళ్తున్న యాత్రికులను చైనాకి చెందిన అధికారులు అడ్డుకుంటున్నారట. మే 8వ తేదిన భారత విదేశాంగ శాఖ మానస సరోవర యాత్ర గురించి ఒక  ప్రకటన విడుదల చేసింది.

ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా నాతూలా మార్గం తెరవబడిందని తెలిపింది. కాకపోతే అదే నాతూలా మార్గాన్ని  చైనా బలగాలు మూసివేసి యాత్రికులను తిరిగి వెళ్లిపోమని చెబుతున్నాయి. ఈ మార్గానికి సిక్కిం నుండి దారి ఉంది. ఇక కైలాష్ మానససరోవరం అనేది టిబెట్‌లో ఉందన్న సంగతి మనకు తెలిసిందే. గత సంవత్సరం.. డోక్లామ్ సమస్య భారత్, చైనాల మధ్య విభేదాలు రగిలించడంతో ఇరుదేశాలు భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో నాతూలా మార్గం ద్వారా భారతీయ యాత్రికులను అనుమతించేది లేదని ఇటీవలే చైనా అధికారులు తేల్చి చెబుతున్నారు.

అయితే నాతూలా మార్గాన్ని తెరిచి ఉంచాలని.. ఇరు దేశాల మధ్య బంధాలు పటిష్టం కావాలంటే ప్రజల మనోభావాలను కూడా గౌరవించాలని.. అందుచేత భారతీయ యాత్రికులు నాతూలా మార్గాన్ని ఉపయోగించుకొనేలా అవకాశం ఇవ్వాలని కోరామని.. అందుకు చైనా ప్రభుత్వం కూడా ఒప్పుకుందని కొన్ని నెలల క్రితం సుష్మా స్వరాజ్ తెలిపారు.

అయితే తాజాగా తమకు అలాంటి సూచనలు ఏమీ అందలేదని చైనా అధికారులు చెప్పడంతో భారతీయ యాత్రికుల పరిస్థితి దుర్భరంగా మారింది. దాదాపు 50 యాత్రా బృందాలు సరిహద్దు వద్ద ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ట్రెక్కింగ్ ద్వారా వెళ్లేవారికి నాతూలా మార్గంతో పని లేదు. కానీ సీనియర్ సిటిజన్స్‌కు అన్ని విధాలుగా ఈ మార్గమే సురక్షితం. కానీ అదే మార్గాన్ని మూసివేయడంతో అలాంటి యాత్రికులు అక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

Trending News