బీహార్ ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ 2018) పరీక్షలో ప్రథమ ర్యాంక్ సొంతం చేసుకున్న కల్పనా కుమారి బీహార్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ నిర్వహించిన ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాల్లోనూ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. సైన్స్ గ్రూప్‌కి చెందిన కల్పనా కుమారి 434 మార్కులతో బీహార్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మరోవైపు ముజఫర్‌పూర్‌లోని ఆర్డీఎస్ కాలేజీకి చెందిన నిధి సిన్హా సైతం కామర్స్ విభాగంలో సరిగ్గా 434 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఇక ఆర్ట్స్ విభాగానికొస్తే, జుముయిలోని సిములతల ఆవాసియ విద్యాలయకు చెందిన కుసుం కుమారి 424 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
గతేడాదితో పోల్చితే, ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 17 శాతం అధిక ఉత్తీర్ణత కనిపించింది. సైన్స్ విభాగంలో45%, కామర్స్ విభాగంలో 82%, ఆర్ట్స్ విభాగంలో 42% మంది విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.