TRS MLC Padi Kaushik Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ అందులో తనకు అంత సంతృప్తి లేదని... అందుకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేను అయి తీరుతానని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలంలోని కొండపాక గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో కౌశికి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ఎమ్మెల్యే అయి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంటున్నానని అన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల రాజేందర్ లాంటి మాస్ లీడర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురైన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక బయటికొస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ముందస్తుగానే ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈటల రాజేందర్ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అయితే, అప్పటికే టిఆర్ఎస్ పార్టీలో యువనేత గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చిన కేసీఆర్.. పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేశారు. ఇదిలావుండగా తాజాగా తన ఎమ్మెల్సీ పదవికి విలువ లేదన్నట్టుగా ఎమ్మెల్సీ పదవి తనకు తృప్తిని ఇవ్వడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తీరుతానని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మతంతోనే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పాడి కౌశిక్ రెడ్డి అన్నారా లేక కేసీఆర్ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ అభిప్రాయంతో సంబంధంలేకుండా పోటీకి సిద్ధపడినట్టయితే.. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీలో ముసలం పుట్టినట్టేననే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ సర్కారు ( KCR ) పాలనలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలే తమ పదవులపై అసంతృప్తితో ఉంటే ఇక మిగతా పార్టీలకు చెందిన ఎమ్మెల్సీల పరిస్థితి ఏంటనే ప్రశ్నలకు సైతం తావిచ్చాయి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.
Also Read : Dharmapuri Arvind: అరవింద్ నివాసంపై దాడి.. తెలంగాణ డీజీపీకి గవర్నర్ ఆదేశాలు
Also Read : Dharmapuri Aravind: బంజారాహిల్స్ పిఎస్‌లో కల్వకుంట్ల కవితపై ధర్మపురి అరవింద్ ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook