రేషన్ ద్వారా తీసుకొనే చౌక బియ్యం ఇతరులకు విక్రయిస్తే రేషన్ కార్డును రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు దాఖలు చేసేలా బుధవారం ప్రజాపంపిణీ వ్యవస్థ(టీపీడీఎస్) ఆర్డరు-2018ని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం రీసైకిల్ చేయడం ఇకమీదట చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. మిల్లర్లపై క్రిమినల్ చర్యలు, భారీగా అపరాధ రుసుము విధించనున్నట్లు ఆర్డరులో వెల్లడించారు. అలాగే చౌక బియ్యాన్ని అమ్మేసే వారి రేషన్ కార్డులు రద్దవుతాయి. వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. బియ్యాన్ని కొనే దళారులు, వ్యాపారులపైనా చర్యలు తీసుకుంటారు.
అటు కార్డుదారులు తీసుకున్న సరుకులకు రశీదు ఇవ్వకున్నా.. తూకాల్లో తేడా చేసినా.. బియ్యం బదులు డబ్బులు ఇచ్చినా డీలర్లపై 420కింద చీటింగ్ కేసులు నమోదు చేస్తామంది. సరకులు తీసుకోని కారణంగా కార్డుల రద్దు కావని పేర్కొన్నారు. ఇంట్లో మహిళ పేరిటే రేషన్ కార్డు జారీ చేయాలని, రేషన్‌కార్డులు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని డీలర్లకు సూచించింది. రేషన్ దుకాణాలను ప్రతీ నెలా 1-15మధ్య తెరచి ఉంచాలని ఆ రోజుల్లో ఉదయం 8-12, సాయంత్రం 4-8గంటల వరకు పనిచేయాలని స్పష్టం చేశారు.