అమెరికాలో వున్న ఐటీ నిపుణులైన భారతీయులకి ఓ గుడ్ న్యూస్. హెచ్-1బీ వీసాదారులు అమెరికా విడిచి వెళ్లే విధంగా హెచ్-1బీ వీసా గడువు కొనసాగింపు పాలసీలో మార్పుచేర్పులు చేసేందుకు అమెరికా ప్రభుత్వం సమాయత్తమవుతోందని గతంలోనే చెప్పుకున్నాం. కానీ తాజాగా అమెరికా పరిపాలనా వర్గాలు ప్రకటించిన వివరాల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు దేశం విడిచి వెళ్లే విధమైన ప్రతిపాదనలని ట్రంప్ సర్కారు పరిగణనలోకి తీసుకోవడం లేదు అని తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వంలోని ఇమ్మిగ్రేషన్ విభాగం కూడా మంగళవారం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 7,50,000 మంది భారతీయులు ఆపదలోంచి గట్టెక్కినట్టే.
హెచ్1బీ వీసాల గడువు పెంపు పాలసీలో నియమ నిబంధనల్లో ఆంక్షలు కఠినతరం చేసి విదేశీ నిపుణులని దేశం విడిచి వెళ్లేలా చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుందని, అందుకు అనుగుణంగా పావులు కదులుతున్నాయని గత వారం వార్తలొచ్చాయి. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ''బయ్ అమెరికన్, హైర్ అమెరికన్'' నినాదానికి అనుగుణంగానే ట్రంప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుని వుండి వుంటుందనే ప్రచారం జరిగింది.
ఒకవేళ అదే కానీ జరిగితే దాదాపు 7,50,000 మంది భారతీయులు అమెరికా విడిచి వెళ్లాల్సిన దుస్థితి వచ్చేది. కానీ అమెరికా అటువంటి ప్రతిపాదనలని పరిశీలించడం లేదు అని ఈరోజు స్వయంగా అక్కడి ఇమ్మిగ్రేషన్ విభాగమే ప్రకటించడం అనేది ఎన్నారైలకి ఎంతో ఊరటని ఇచ్చే అంశం.