ఉత్తర ఇంగ్లాండ్ దేశంలో మళ్లీ ఓసారి మతానికి సంబంధించిన వివాదం తలెత్తింది. విష్బోన్ కంపెనీకి చెందిన బీరు ప్రొడక్టుకి "గణేష్" అని పేరు పెట్టారు. బీర్ ఫెస్టివల్లో భారతీయులను ఆకట్టుకొనేందుకు ఓ పాపులర్ పేరు కోసం ప్రయత్నించామని.. ఈ క్రమంలో తమ ప్రొడక్టుకి ఈ పేరు పెట్టామని వారు తెలిపారు. అయితే విష్బోన్ సంస్థ వారిపై యునివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం ప్రెసిడెంట్ రాజన్ జెద్ మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే సహించమని తెలిపారు.
గణేష్ అనే పేరు హిందువుల ఆరాధ్య దైవమైన వినాయకుడికి మరో పేరని... ఆ పేరును అవమానించే పనులు చేస్తే తాము ఊరుకోమని సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు. వెంటనే ఆ పేరు తాము తెలియక వాడామని.. తమ పొరపాటుని క్షమించమని విష్బోన్ సంస్థ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. తమ ప్రొడక్టు ఇండియన్ల మనసు దోచుకుంటుందనే ఉద్దేశంతోనే తాము ఆ పేరు వాడామని.. ఆ విషయం ఇంత వివాదాస్పదమవుతుందని తాము అనుకోలేదని ఈ సందర్భంగా విష్బోన్ బ్రూవరీస్ అధిపతి అడ్రియన్ చాప్మన్ వివరణ ఇచ్చారు.
"గణేష్ అనే పేరుతో విడుదల అవుతున్న బీర్ బాటిల్స్ ప్రొడక్షన్ వెంటనే ఆపివేశాం. ఇంకా ఈ ప్రొడక్టు మార్కెట్లో విడుదల కాలేదు. కనుక పెద్ద అపాయం తప్పింది. మేము కచ్చితంగా ఇతరుల మనోభావాలను, సంప్రదాయాలను, మత పద్ధతులను గౌరవిస్తాం" అని విష్బోన్ సంస్థ ప్రకటనను విడుదల చేసింది. అయితే హిందు దేవతల పేర్లను పలు బీరు కంపెనీలు వాడడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా టోల్గేట్ బ్రూవరీస్ అనే సంస్థ "కాళిక" పేరు మీద ఓ బీర్ ప్రొడక్టు విడుదల చేసింది. కానీ తీవ్ర అభ్యంతరాలు రావడంతో వెంటనే ఆ ప్రొడక్టు తయారీని ఆపివేసింది.