డ్రీమర్స్ పథకాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పిల్లలుగా ఉన్నప్పుడే అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారు తిరిగి స్వదేశానికి వెళ్లకుండా రక్షణ కల్పించే చట్టం డిఫర్ట్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ ఎరైవల్స్ (డిఎసిఎ) పథకం మునపటి అధ్యక్షుడు ఒబామా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా డ్రీమర్స్‌కు కార్మిక అనుమతులు జారీ చేసేందుకూ వీలుకల్గింది. తాజా ఉత్తర్వులతో బాల్యంలో వలస వాదులను అమెరికాలో స్థిరపడ్డ వారికి ఎలాంటి రక్షణ ఉండబోదు. టెక్సాస్ నేతత్వంలో దాదాపు 9 రిపబ్లిక్ రాష్ట్రాల అటార్ని జనరల్స్ వత్తిడి మేరకు ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. డిఎసిఎ పథకం కింద ఇక ముందు ఎటువంటి దరఖాస్తులు తీసుకోబోమని దేశీయ భద్రతా విభాగం వేరేక ప్రకటనలో పేర్కొంది.
8 వేల మంది భారతీయులపై ప్రభావం
ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం వల్ల 8 వేల మంది భారతీయలపై ప్రభావం చూపనుంది. ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల వలసలపై ప్రభావంపై చూపనుందని విశ్లేషకులు అభిప్రాయం. మరోవైపు తమను దేశం నుంచి బహిష్కరిస్తారేమోనని భారత సంతతి డ్రీమర్స్‌లో ఆందోళన వ్యక్తమవుతోందని సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగేదర్ సంస్థ తెలిపింది.
ట్రంప్ నిర్ణయంపై విమర్శల వెల్లువ..
ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం పట్ల అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది క్రూరమైన చర్యగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ధ్వజమెత్తారు. డ్రీమర్స్‌వైపు తాము పోరాడతామని దిగ్గజ సాంకేతిక సంస్థలు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ ప్రతినబూనాయి.