Farmer Arrived In Audi A4 car : ఒక సాధారణ రైతు ఆడి కారులో వచ్చి కూరగాయలు అమ్మడం ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. ఒకవేళ అలాంటి దృశ్యం మన కంటపడితే చూడ్డానికి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా ? అయినా రైతే రాజు అనే మాటలు రాజకీయ నాయకులు చెప్పడానికి పనికొచ్చే కొటేషన్స్ కింద బాగుంటాయి కానీ నిజానికి రైతులకు అలాంటి పరిస్థితి ఎక్కడుంది అని అనుకుంటున్నారా ? అలా బతకడం అందరీకి సాధ్యం అయ్యేనో కాదో తెలియదు కానీ ఇదిగో ఈ కుర్రాడికి మాత్రం సాధ్యమైంది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా బిజినెస్‌మేన్ అంటే నీటుగా సూట్ బూట్ వేసుకుని, మెడకు టై కట్టుకుని, టక్కు వేసుకుని.. వీలైతే ఖరీదైన కారు లేదంటే ఖరీదైన బైక్ వేసుకుని ఆఫీసుకు వెళ్తారనేది ఒక అభిప్రాయం.. అలాగే రైతు అనగానే లుంగీ లేదా దోతి కట్టుకుని, తలపాగా చుట్టుకుని ఎండ అనక, వాన అనక ఏదీ లెక్కచేయకుండా అర్వకష్టం చేసినా చాలీచాలని రాబడితో ఉండీ లేనట్టుగా జీవితాన్ని వెళ్లదీసుకొస్తారని మరో రకమైన అభిప్రాయం. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బిజినెస్మేన్ల విషయంలో మొదటి అభిప్రాయం నిజమే.. అలాగే మెజారిటీ రైతుల విషయంలో రెండో అభిప్రాయం కూడా నిజమే. కట్టుబొట్టులో, వేషధారణలో, బతికే తీరుతెన్నుల్లో ఈ ఇద్దరినీ వేరు చేస్తోంది వారి ఆర్థిక పరిస్థితులే. వీలైతే గొప్పగా, హుందాగా, దర్జాగా బతకాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. కానీ ఎవరికైనా ఆ స్థితిని కల్పించేది వారి ఆర్థిక పరిస్థితే.
అయితే, రైతు అంటే ఇలానే ఎందుకుండాలి.. నేను ఖరీదైన కారులోనే తిరుగుతా.. ఖరీదైన కారులోనే మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు అమ్ముతా అంటున్నాడు కేరళకు చెందిన సుజీత్ ఎస్పీ అనే ఓ యువ రైతు. తను అలా అనుకోవడమే కాదు.. తను అనుకున్నదే చేసి చూపిస్తున్నాడు కూడా.
ఖరీదైన లగ్జరీ కార్లలో ఒకటైన ఆడి A4 కారులో తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లి అక్కడ ఎరుపు రంగు పాలకూరను కోసిన సుజీత్.. ఆ తరువాత ఆడి కారులో మార్కెట్‌కి వచ్చి.. అక్కడ ఓ పెద్ద మ్యాట్ని కిందపరిచి, అక్కడే ఆ పాలకూర అమ్మేసి మళ్లీ ఆడి కారులో ఇంటికి వెళ్లిపోతున్నాడు. తాజాగా సుజీత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపించింది.
ఈ వీడియో చూసిన జనం ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక రైతు ఆడి కారులో కూరగాయల మార్కెట్‌కి వచ్చి ఆకు కూరలు అమ్మి మళ్లీ సింపుల్‌గా తన ఆడి కారులో వెళ్లిపోవడం ఏంటి అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజెన్స్ తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన సుజీత్ ఆ తరువాత కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని, తనకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పరిజ్ఞానంతో ఆకుకూరలు, కూరగాయలు పండించి వాటిని సమీపలోనే మార్కెట్లో విక్రయిస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు చెబుతున్నాయి.
ఈ ఆడి కారును కూడా సుజీత్ 40 లక్షల రూపాయలు పోసి సెకండ్ హ్యాండ్ కారు కింద కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది అనే సినిమా డైలాగ్‌ని సుజీత్ నిజం చేసి చూపించాడు అనిపిస్తోంది. అయినా ఇప్పటికీ సుజీత్ నిజంగా రైతేనా లేక వ్యూస్ కోసమే ఇలాంటి వీడియో చేసి పోస్ట్ చేశారా అని సందేహం రాకమానదు. ఎందుకంటే ఎంతమంది రైతులకు ఈ భాగ్యం దక్కుతుంది కనుక ఇలాంటి దృశ్యాన్ని అంత ఈజీగా నమ్మగలం చెప్పండి.