Harbhajan Singh wants New T20I Coach for Team India: పటిష్ట జట్లలో ఒకటైన భారత్ ఖాతాలో ఉన్న ఐసీసీ ట్రోఫీలు నాలుగు మాత్రమే. 1983 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ. 2007లో టీ20 ప్రపంచకప్‌ని సొంతం చేసుకున్న భారత్ .. మరోసారి పొట్టి టోర్నీలో విజేతగా నిలవలేకపోయింది. 2014లో టైటిల్ సాధించే అవకాశం వచ్చినా.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. అనంతరం ఒక్కసారి కూడా భారత జట్టు ఫైనల్‌కు చేరలేదు. 2021లో సెమీస్‌కు చేరని భారత్.. 2022 ప్రపంచకప్‌లో నాకౌట్ పోరులో పరాజయం పాలైంది. ఇక 2024లో మరోసారి పొట్టి ప్రపంచకప్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2024ని దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యానికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ కీలక సూచన చేశాడు. పొట్టి టోర్నీలో భారత జట్టు తడబడకుండా ఉండాలంటే.. టీ20లకు ప్రత్యేక కోచ్‌ని నియమించాలన హర్భజన్ సూచించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో బాధ్యతలను మరో కోచ్ చూసుకోవాలని మాజీ స్పిన్నర్ చెప్పాడు. హర్భజన్ భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 417, వన్డేలలో 269, టీ20లలో 25 వికెట్స్ పడగొట్టాడు.
'ఇంగ్లండ్ జట్టుకు ఇద్దరు కెప్టెన్‌లు ఉన్నారు. ఆ జట్టు బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని కోచ్‌గా నియమించుకుంది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిశ్ నెహ్రాతో మనం ప్రయోగం చేయవచ్చు. నెహ్రా శిక్షణలో ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా విజయం సాధించాడు. టీ20 కాన్సెప్ట్, పొట్టి ఫార్మాట్ అవసరాలను గుర్తించే వారిని కోచ్‌గా నియమించండి. ప్రస్తుతం అందరి దృష్టంతా టీ20లపైనే ఉంది. ఈ ఫార్మాట్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దాలో నెహ్రాకు బాగా తెలుసు. టెస్టులు, వన్డేలలో జట్టును అగ్రస్థానానికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు రాహుల్ ద్రవిడ్ వద్ద ఉన్నాయి' అని హర్భజన్ సింగ్ అన్నాడు.
టెస్టులు, వన్డేలకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. టీ20లకు కోచ్‌గా ఆశిశ్ నెహ్రా ఉంటే బాగుంటుందని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 2024లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటి నుంచే మంచి జట్టుని తయారు చేయడంపై దృష్టిసారించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టీ20లకు ఎంపిక చేయకుండా.. హార్దిక్ పాండ్యా కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook