మహాత్మగాంధీ జీవిత చరిత్ర చదివిన వారికి ఆయన పాఠశాల రోజులకు సంబంధించిన విషయాలు గుర్తుండే ఉంటాయి. గాంధీ చిన్నప్పుడు వ్యాయామాల విషయంలోనూ, ఆటల విషయంలోనూ పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదని ఆ పుస్తకంలో ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఓ పుస్తకం ఆటలకు సంబంధించి గాంధీ జీవితానికి సంబంధించిన మరో కోణాన్ని కూడా ఆవిష్కరిస్తోంది. ఆ పుస్తకం పేరే 'Mahatma on the Pitch: Gandhi & Cricket in India'. కౌశిక భందోపాధ్యాయ రచించిన ఈ పుస్తకంలో గాంధీజీ స్నేహితుడైన రతిలాల్ గేలాభాయ్ మెహతా మాటల్లో, గాంధీజీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమో తెలియజేస్తారు రచయిత. "మేమిద్దరం ఎన్నోసార్లు కలిసి క్రికెట్ ఆడాం. గాంధీ బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లోనూ దిట్ట" అని ఆయన పేర్కొంటారు. రాజ్‌కోట్ ప్రాంతంలో గాంధీ ఎక్కువగా క్రికెట్ ఆడారని కూడా ఆయన తెలియజేశారు.