బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న ఆసీస్ కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఏడాదికాలం పాటు నిషేధం విధించనున్నట్లు సమాచారం. మరో పక్క ఆ జట్టు కోచ్ డారెన్ లెహమాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు ఆడనుంది. ఈ టెస్టుకి ముందే డారెన్ తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐతే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. మంగళవారం రాత్రికి స్మిత్, వార్నర్‌ల భవితవ్యంపై కీలక తీర్పు వచ్చే అవకాశం ఉంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తీర్పు ఇవ్వనున్నారు. ‘ఇలాంటి ఘటనలపై అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో ఉండటం సహజం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటాం’ అని సదర్లాండ్ అన్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే ఐసీసీ స్మిత్‌పై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో వందశాతం, బెన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. మరో పక్క ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి స్మిత్‌ను తప్పించి రహానెకు బాధ్యతలు అప్పగించింది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే నిర్ణయంపైనే వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఆడించాలా? లేదా? అనేది తేలనుంది.