Harbhajan Singh says I wanted to retire in an Indian jersey but fate had something else planned: టీమిండియా వెటరన్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు (Retirement) పలికారు. ట్విటర్, యూట్యూబ్ ఛానెల్లో భజ్జీ ఈ విషయాన్ని శుక్రవారం (డిసెంబర్ 24) వెల్లడించారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తన తల్లిదండ్రులు, భార్య మరియు సోదరీమణుల కృషి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. అవసరమైతే భారత క్రికెట్‌కు కొత్త పాత్రల్లో సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా హర్భజన్ స్పష్టం చేశారు. అయితే ఓ కోరిక తీరకుండానే రిటైర్మెంట్ (Harbhajan Singh Retirement) ఇచ్చినట్టు భజ్జీ భావోద్వేగం చెందారు.
హర్భజన్ సింగ్ తన పదవీ విరమణ ప్రసంగంలో మాట్లాడుతూ... 'జలంధర్ వీధుల్లో నంచి భారత క్రికెట్ జట్టులో ఆడిన నా 25 ఏళ్ల ప్రయాణం చాలా అందంగా సాగింది. భారత క్రికెట్ జట్టు జెర్సీ ధరించి దేశం కోసం ఆడడమే పెద్ద ప్రేరణ. మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నేను గత కొన్నేళ్లుగా ఒక ప్రకటన చేయాలని ఎదురుచూస్తున్నాను. అయితే దానిని మీ అందరితో పంచుకోవడానికి సరైన క్షణం కోసం ఎదురు చూశాను. ఈ రోజు ఆ సమయం వచ్చింది కాబట్టే.. రిటైర్మెంట్ ప్రకటించా. నేను చాలా కాలం క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నా ప్రకటించలేకపోయాను. నిజానికి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాను. కానీ కోల్‌కతాతో ఒప్పందం ఉన్నందున దానిని ప్రకటించలేదు' అని తెలిపారు.
'ఇతర క్రికెటర్ల మాదిరిగానే నేను కూడా భారత జెర్సీలోనే రిటైర్ కావాలనుకున్నాను. కానీ విధి మరొకటి ప్లాన్ చేసింది. నేను ఏ జట్టు కోసం ఆడినా 100 శాతం నిబద్ధతతో ఆడతాను. నా జట్టు అగ్రస్థానంలో ఉండాలని ఎప్పుడూ కోరుకున్నా.భారత క్రికెట్ జట్టు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సర్రే లేదా ఎసెక్స్ కౌంటీ అయినా నేను 100 శాతం కష్టపడ్డాను' అని హర్భజన్ సింగ్ చెప్పారు. భారత్ తరఫున తరఫున భజ్జీ 103 టెస్టుల్లో 417 వికెట్లు.. 236 వన్డేల్లో 269 వికెట్లు.. 28 టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టారు. మొత్తంగా భజ్జీ 711 అంతర్జాతీయ వికెట్లు తీశారు.
'నా గురూజీ సంత్ హర్చరణ్ సింగ్ ఆశీస్సుల వల్ల నేను క్రికెట్, జీవితంలో చాలా సాధించగలిగాను. గురూజీ నా జీవితానికి ఒక దిశానిర్దేశం చేశారు. నా కలలను సాకారం చేసేందుకు మా నాన్న సర్దార్ సర్దేవ్ సింగ్ ప్లాహా, తల్లి అవతార్ కౌర్ ప్లాహా చాలా కష్టపడ్డారు. వారి కృషి వల్లనే నేను భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగాను. వచ్చే జన్మలో వారి కొడుకుగా మళ్లీ పుట్టాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నా సోదరీమణులు నా కోసం చాలా ప్రార్థనలు చేసారు. అందువల్లే నేను నా జీవితంలో చాలా ఆనందాన్ని పొందాను. వారు నా కోసం చేసిన దానికి నేను ఎప్పటికీ తిరిగి చెల్లించలేను. నేను మీతో ఎక్కువగా సమయం గడపలేదని నాకు తెలుసు. ఎన్ని రక్షాబంధన్‌లకు నేను మీకు అందుబాటులో లేనో కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం మీకు అందుబాటులో ఉంటాను. మీరు నా రాక్‌స్టార్స్. మిమ్మాల్సి ఎప్పుడూ ప్రేమిస్తుంటా. మీరు నా కుటుంబానికి మూలస్తంభాలు' అని భజ్జీ భావోద్వేగం చెందారు.
'ఈ ప్రయాణంలో నాకు అండగా ఉన్న నా భార్య గీతకు ధన్యవాదాలు. నాలో మంచి, చెడు రెండింటినీ చూశారు. ఇప్పుడు మీతో గడపడానికి నాకు తగినంత సమయం ఉంది. ఇక మీరు నా గురించి ఎవరికీ ఫిర్యాదు చేయలేరు. హీనయా హీర్ మరియు జోవన్ వీర్ నా ప్రాణం. మీరిద్దరూ పెద్దయ్యాక నేను ఏమి చేశానో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఇద్దరి ఎదుగుదలను చూడటానికి మరియు మీ అందరితో ఎక్కువ సమయం గడపడానికి ఇప్పుడు నాకు సమయం దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. 2007 టీ20 ప్రపంచకప్ మరియు 2011 వన్డే ప్రపంచకప్ విజయాలు నాకు చిరస్మరణీయమైనవి. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. అండర్ 14, టీమిండియా, ఐపీఎల్ టోర్నీలోని నా సహచరులు మరియు ప్రత్యర్థి ఆటగాళ్లందరికీ ధన్యవాదాలు. కోచ్‌లు, గ్రౌండ్స్‌మెన్, అంపైర్లు, మీడియా మరియు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నేను దేశం కోసం ఆడుతున్నప్పుడు నా కోసం ప్రార్థించిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా మరియు బీసీసీఐ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పంజాబ్ రాష్ట్రంకు ధన్యవాదాలు. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ రోజు నేను సాధించినదంతా క్రికెట్ వల్లే. భారత క్రికెట్‌కు ఏ విధంగానైనా సహాయం చేసినందుకు నేను సిద్ధంగా ఉన్నాను' అని హర్భజన్ (Harbhajan Singh) చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook