Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

Ind Vs Nz 1st Odi Updates: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికారేశాడు. సహచరులంతా ఔట్ అవుతున్నా.. ఒక్కడే క్రీజ్‌లో పాతుకుపోయి సిక్సర్ల వర్షం కురిపించాడు. అతిపిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 07:06 PM IST
Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్

Ind Vs Nz 1st Odi Updates: న్యూజిలాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన సృష్టించాడు ఓపెనర్ శుభ్‌మన్ గిల్. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి.. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. గిల్ 149 బంతుల్లో 9 సిక్సర్లు, 19 ఫోర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరు స్కోరు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో షిప్లే, మిచెల్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్గ్యూసన్, టింక్నర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అతి చిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై బెంగళూరులో రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజులు) తక్కువ వయసులో డబుల్ సెంచరీ చేయగా.. ఇటీవల బంగ్లాపై డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) బద్దలు కొట్టాడు. తాజాగా ఈ రికార్డును గిల్ (23 ఏళ్ల 132 రోజులు) సవరించాడు. 

182 పరుగుల నుంచి గిల్ వరుసగా మూడు సిక్సర్లు బాది డబుల్ సెంచరీ మార్క్ చేరుకోవడం విశేషం. ఇతర బ్యాట్స్‌మెన్ మొత్తం ఒకరి తరువాత ఒకరు ఔట్ అవుతున్నా.. గిల్ మాత్రం పట్టువీడలేదు. ఒంటరి పోరాటం చేశాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 

19వ ఓవర్‌లో 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్‌కు ఒకే బంతికి రెండు లైఫ్‌లు వచ్చాయి. క్రీజ్ వదిలి ముందు భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా మిస్ అయింది. కీపర్ లాథమ్ క్యాచ్‌ను మిస్ చేయగా.. స్టంపింగ్ కూడా చేయలేకపోయాడు. దీంతో ఒకే బంతికి రెండు లైఫ్‌లు వచ్చాయి. ఆ తరువాత భారీ సిక్సర్‌తో గిల్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక్కడి నుంచి జట్టు ఇన్నింగ్స్‌ను అంతా తానై నడిపించాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్‌లోనూ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. 

 

కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు పూర్తి చేశాడు గిల్. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఫఖర్ జమాన్ కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లోనూ వెయి రన్స్ చేసి మొదటిస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో సచిన్ 186 పరుగులు చేశాడు. 

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News