ఇండియా Vs ఆస్ట్రేలియా: యంగ్ టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా ?

ఇండియా Vs ఆస్ట్రేలియా అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ నేడే

Last Updated : Feb 3, 2018, 10:51 AM IST
ఇండియా Vs ఆస్ట్రేలియా: యంగ్ టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా ?

నేడే అండర్ 19 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యావత్ క్రికెట్ ప్రియుల దృష్టి ఈ క్రికెట్ మ్యాచ్‌పైనే వుంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఓ ప్రత్యేకత వుంది. ఈ మ్యాచ్‌లో తలపడుతున్న ఇండియా, ఆస్ట్రేలియా జట్లు రెండు కూడా చెరో మూడుసార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న దేశాలుగా రికార్డ్ సృష్టించాయి. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్లు నాలుగోసారి వరల్డ్ కప్ గెలిచిన దేశంగా చరిత్ర సృష్టిస్తారు. ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకోబోయే దేశం ఏదో తెలియాలంటే ఈ మ్యాచ్ ఫలితం తేలాల్సిందే. అందుకే ఈ మ్యాచ్‌కి అంత ప్రాధాన్యత, ప్రత్యేకత వుంది అంటున్నాయి క్రీడావర్గాలు.

వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం చేజిక్కించుకున్న యంగ్ టీమిండియాను ఫేవరేట్‌గా భావించవచ్చంటున్నాయి క్రికెట్ వర్గాలు. అందుకు కారణం ఆ ఐదు జట్లలో తొలి మ్యాచ్ గెలిచింది ఈ ఆస్ట్రేలియా జట్టుపైనే కావడం. ఆస్ట్రేలియాపై ఆ మ్యాచ్‌లో కెప్టెన్ పృథ్వి షా (94), ఓపెనర్ మన్‌జోత్ కల్రా (86), శుభ్‌మాన్ గిల్ (63) పరుగులతో అద్భుతంగా రానించడమే కాకుండా ఆ ఫామ్‌ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగని ఆస్ట్రేలియా జట్టుని కూడా తేలిగ్గా తీసుకోకూడదనే ఇంకొంతమంది వాదన. సత్తా లేనిదే ఏ జట్టు కూడా ఫైనల్స్ వరకు రాదు కనుక ఆస్ట్రేలియా ఆటగాళ్ల సత్తాని తక్కువ అంచనా వేయకూడదనేది వారి అభిప్రాయం. విజయానికి ఒక్క అడుగు దూరంలో వున్నప్పుడు జాగ్రత్త పడకపోతే తర్వాత తేరుకున్నా చేసేదేం వుండదు కదా మరి!! 

Trending News