జట్టు ఎంపికలో తప్పు చేశామనిపిస్తోంది: కోహ్లీ

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో తమ ఆటతీరు అత్యంత పేలవంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు.

Last Updated : Aug 13, 2018, 06:09 PM IST
జట్టు ఎంపికలో తప్పు చేశామనిపిస్తోంది: కోహ్లీ

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో తమ ఆటతీరు అత్యంత పేలవంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. లార్డ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. రెండో టెస్టులో ప్రదర్శన ప్రకారం తమకు గెలిచే అర్హత లేదన్నాడు. గత ఐదు టెస్టుల్లో ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని పేర్కొన్నాడు. తుదిజట్టు ఎంపికలో తప్పుచేశామని ఇప్పుడు అనిపిస్తోందన్న కోహ్లీ.. మిగితా మూడు టెస్టుల్లో తప్పకుండా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

‘మా ఆటతీరు పేలవంగా ఉంది. గత ఐదు టెస్టుల్లో మరీ ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ ఆడలేదు. ఈ టెస్టులో మాకు గెలిచే అర్హత లేదు. పిచ్‌, ప్రతికూల వాతావరణ పరిస్థితులంటూ సాకులు చెప్పను. మొత్తంగా చెప్పాలంటే.. మేం ఏమాత్రం బాగా ఆడలేదు. ఆటే కాదు.. తుది జట్టు ఎంపికలోనూ తప్పుచేశాం’ అని కెప్టెన్‌ కోహ్లీ అన్నారు.

లార్డ్స్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమిపాలైంది. తొలుత ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌ చేయక తప్పింది కాదు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకి తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ ఆటగాళ్లకు కోలుకోలేని షాక్ తగిలింది.

తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 107 పరుగులకే అందరూ అవుట్ అయ్యారు. ఆ ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్, పూజారా లాంటి వారందరూ చేతులెత్తేయడంతో.. ఆశ్విన్ చేసిన 29 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. కోహ్లీ కూడా కేవలం 23 పరుగులే చేశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలుత కాస్త నెమ్మదించినా.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ విశ్వరూపం చూపించింది. వోక్స్(130), బెయిర్‌స్టో(93) తమ పరుగులతో స్టేడియంను హోరెత్తించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ 88.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడడానికి బరిలోకి టీమిండియా ఈసారి కూడా చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్లు రవిచంద్రన్ అశ్విన్ 33, హార్ధిక్ పాండ్యా 26, కోహ్లీ 17 పరుగులు చేశారు.  ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్ చెరో నాలుగు వికెట్ల చొప్పున తీయగా, క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశారు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడకుండానే 159 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్  2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.

Trending News