టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ ఇటీవలే తనను భర్త వేధిస్తున్నాడని, హత్య చేయాలని ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో షమీపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. అలాగే ఆయనతో పాటు మరో నలుగురిపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ రోజే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి జహాన్ పంపడం గమనార్హం. ఆ ఫిర్యాదుతో పాటు జహాన్ మరో ఆరోపణ కూడా చేయడంతో ఇప్పుడు ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
షమీ ఒక క్రికెట్ మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు పాకిస్తాన్ నుండి ఓ అమ్మాయి ఇండియాకి వచ్చిందని.. ఆ అమ్మాయి నుండి షమీ డబ్బు తీసుకున్నాడని ఆయన భార్య ఆరోపించింది. ఈ విషయంపై కూడా విచారణ చేయించాలని ఆమె సీఓఏని కోరింది. అయితే తాను మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు వస్తున్న వార్తలపై షమీ స్పందించాడు. తాను తప్పు చేసినట్లు తేలితే చంపేయండి అని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అలాగే బీసీసీఐ తన కాంట్రాక్టుని రద్దు చేసినందుకు కూడా చాలా బాధపడుతున్నానని ఆయన తెలిపారు.