1983 World Cup: భారత క్రికెట్ చరిత్రలోనే.. ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 39 ఏళ్లు!

39 Years Ago Indian Cricket Team Won 1983 World Cup vs West Indies. 1983లో  అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన కపిల్‌ దేవ్ సారథ్యంలోని భారత జట్టు అంచనాలకి మించి రాణించి విశ్వవిజేతగా నిలిచింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 25, 2022, 12:42 PM IST
  • భారత క్రికెట్ చరిత్రలోనే
  • ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 39 ఏళ్లు
  • 43 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా
1983 World Cup: భారత క్రికెట్ చరిత్రలోనే.. ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 39 ఏళ్లు!

39 Years Ago Indian Cricket Team Won 1983 World Cup: టీమిండియా మొదటి ప్రపంచకప్ గెలిచి నేటికి సరిగ్గా 39 ఏళ్లు. 1983లో ఇంగ్లండ్ గడ్డపై అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన కపిల్‌ దేవ్ సారథ్యంలోని భారత జట్టు అంచనాలకి మించి రాణించి విశ్వవిజేతగా నిలిచింది. అప్పట్లో అగ్రశ్రేణి జట్టుగా ఉన్న వెస్టిండీస్‌ని ఫైనల్లో ఏకంగా 43 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. భారత క్రికెట్‌ గతిని పూర్తిగా మార్చేసింది. అప్పటి రోజుల్లో భారత దేశంలో హాకీ రాజ్యమేలుతుండగా.. కపిల్‌ సేన అద్భుత విజయంతో క్రికెట్ కూడా ఉందని దేశ ప్రజలకు చాటిచెప్పింది. లార్డ్స్ బాల్క‌నీలో ప్రపంచకప్  ట్రోఫీని క‌పిల్ దేవ్ అందుకున్న ఆ క్ష‌ణాల‌ను ఎవ‌రూ మ‌రిచిపోలేరు. 

1975లో జరిగిన తొలి క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్‌ 3 మ్యాచ్‌లలో కేవలం ఒకటే (అదికూడా ఈస్ట్‌ ఆఫ్రికాపై) గెలిచింది. 1979లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో అయితే ఆ ఒక్క విజయం సాధ్యంకాలేదు. ప్రపంచకప్‌లు మినహాయించి అప్పటి వరకు 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్..‌ సొంతగడ్డపై 2 మాత్రమే గెలుచుకుంది. దాంతో 1983 ప్రపంచకప్‌లో కపిల్‌ దేవ్‌ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్‌ నెగ్గి జోరుమీదున్న వెస్టిండీస్‌తో భారత్ తొలి మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. ఆ మ్యాచులో  34 పరుగులతో గెలుపొంది ఔరా అనిపించింది. 

లీగ్‌ దశలో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, జింబాబ్వేపై రెండేసి మ్యాచులు ఆడింది భారత్. వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపు.. 66 పరుగులతో ఓటమి. జింబాబ్వేపై 5 వికెట్లతో.. 31 పరుగులతో విజయం, ఆస్ట్రేలియాపై 162 పరుగులతో ఓటమి.. 118 పరుగులతో విజయం సాధించింది. లీగ్‌ దశలో మొత్తంగా 4 మ్యాచ్‌లు గెలిచి సెమీ ఫైనల్‌ చేరిన భారత్.. అక్కడ ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌ చేరింది. జూన్‌ 25 1983 ఫైనల్‌కు వెళ్లినా దుర్బేధ్యమైన లైనప్‌ ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌తో మ్యాచ్. దాంతో గెలుపై ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది.

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా  బ్యాటింగ్ చేసిన భారత్ 54.5 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ శ్రీకాంత్ (38: 57 బంతుల్లో 7x4, 1x6) టాప్ స్కోరర్ కాగా.. మహీందర్ అమరనాథ్ (26: 80 బంతుల్లో 3x4), సందీప్ పాటిల్ (27: 29 బంతుల్లో 1x6), కపిల్ దేవ్ (15: 8 బంతుల్లో 3x4) విలువైన పరుగులు చేశారు. మేటి జట్టు ముందు స్వల్ప స్కోర్ ఉండడంతో టీమిండియాకు ఆశలు లేకపోయాయి. కానీ కపిల్‌ సేన మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు.

సూపర్ ఫామ్‌లో ఉన్న వెస్టిండీస్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో భారత బౌలర్ల దెబ్బకు 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. వివ్ రిచర్డ్స్ (33: 28 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్‌. భారత బౌలర్లలో మదన్‌లాల్, అమరనాథ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. భారత్ 43 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఆ క్షణాన లార్డ్స్‌ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది. ఆపై 28 ఏళ్ల తర్వాత 2011 ఏప్రిల్ 2న ముంబై వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకను చిత్తుచేసి రెండోసారి కప్ అందుకుంది. 

Also Read: Revanth Reddy: కేసీఆర్ లో కలవరం.. రేవంత్ రెడ్డి టీమ్ సంబురం! పీకే సర్వేలో ఏముంది?  

Also Read: Covid Cases Updates: లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు.. ఐదు నెలల గరిష్టం.. భారత్ లో  విజృంభిస్తున్న కొవిడ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News