మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ కథనాలపై స్పందించిన రవిశాస్త్రి

ధోనీ వన్డే ఇంటర్నేషనల్స్‌కి వీడ్కోలు పలకనున్నాడా అనే సందేహాలపై స్పందించిన రవిశాస్త్రి

Last Updated : Jul 19, 2018, 03:43 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ కథనాలపై స్పందించిన రవిశాస్త్రి

ఒకప్పుడు క్రికెట్ ప్రియుల నుంచి జేజేలు అందుకున్న టీమిండియా మాజీ కెప్టేన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల కాలంలో బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడని విమర్శలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ధోనీ పేలవమైన ప్రదర్శన కనబర్చాడని తీవ్ర విమర్శలు రావడం క్రీడావర్గాల్లో చర్చనియాంశమైంది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ధోనీ వన్డే ఇంటర్నేషనల్స్‌కి వీడ్కోలు పలకనున్నాడా అని మీడియాలో వెలువడిన అనేక కథనాలు ధోనీ అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి. 

ధోనీ రిటైర్‌మెంట్‌పై వస్తున్న పుకార్ల గురించి తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ధోనీ వన్డే ఇంటర్నేషనల్స్‌కి వీడ్కోలు పలకనున్నాడా అనే సందేహాలను కొట్టిపారేసిన రవిశాస్త్రి, అతడు జట్టులో పూర్తి స్థాయిలో కొనసాగుతున్నట్టు స్పష్టంచేశాడు. మంగళవారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ ఎంపైర్ నుంచి బంతిని తీసుకోవడం గమనించిన క్రికెట్ ప్రియులు.. ఇక ధోనీకి ఇదే ఆఖరి మ్యాచ్ కానుందా ? అందుకే ఎంపైర్ నుంచి బంతిని తీసుకున్నాడా ? త్వరలోనే ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటన చేయనున్నాడా అంటూ రకరకాల సందేహాలు వెలిబుచ్చారు. 

అయితే, ధోనీ ఎంపైర్ నుంచి బంతిని తీసుకోవడంపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కి బంతిని చూపించడం కోసమే ధోనీ ఆ బంతిని తీసుకున్నాడని, అంతకు మించి ఇందులో ఇంకెటువంటి సందేహాలు అవసరం లేదు' అని తేల్చిచెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News