పాక్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీమిండియా

పాక్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీమిండియా

Last Updated : Sep 24, 2018, 07:35 AM IST
పాక్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీమిండియా

ఆసియా కప్ 2018లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆసియా క‌ప్‌లో భాగంగా భార‌త్‌ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచుల్లో భాగంగా ఆదివారం ఈ మ్యాచ్ జరిగింది.

కాగా సూప‌ర్-4 మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్.. నిర్ణీత‌ 50 ఓవ‌ర్లలో 7 వికెట్లు నష్టపోయి 237 ప‌రుగులు చేసింది. భార‌త్ ముందు 238 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. షోయ‌బ్ మాలిక్ 78, స‌ర్ప‌రాజ్ అహ్మద్ 44, ఫ‌కార్ జ‌మాన్ 31, ఆసీఫ్ అలీ 30 ప‌రుగుల‌తో రాణించగా భార‌త బౌల‌ర్లలో చాహ‌ల్, కుల్దీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు.

అనంత‌రం 238 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ 39.3 ఓవ‌ర్లలో ఒక్క వికెట్ నష్టానికి 238 ప‌రుగులు చేసి.. పాక్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని మరో తొమ్మిది వికెట్లు ఉండగానే ఛేదించింది.  భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో చెలరేగిపోయారు. రోహిత్ శ‌ర్మ 111 (119 బంతుల్లో 7×4, 4×6), శిఖర్ ధావ‌న్ 114 (100 బంతుల్లో 16×4, 2×6) చేశారు. అంబటి రాయుడు 12 ప‌రుగుల‌తో రాణించారు. ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

ఈ క్రమంలో వన్డేల్లో 7 వేల పరుగుల మైలురాయిని కెప్టెన్ రోహిత్ శర్మ దాటగా.. రోహిత్‌కిది 19వ సెంచరీ,187వ మ్యాచ్‌. అతను ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్‌ కూడా. అటు వన్డేల్లో ధావన్ కూడా 15వ సెంచరీ సాధించాడు.

అటు ఆసియా కప్ 2018 సూపర్-4లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన పోరులో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక సూపర్-4లో రెండో ఓటమితో ఆఫ్ఘన్‌కు ఫైనల్ అవకాశాలు మూసుకుపోయాయి.

టీమిండియా మంగళవారం తన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

Trending News