పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్‌కి మంగళవారం మైదానంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. హమిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఫీల్డర్ మున్రో విసిరిన బంతి నేరుగా తల వెనుక భాగంలో వేగంగా వచ్చి తగలడంతో షోయబ్ మాలిక్ పిచ్‌పై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బంతి బలంగా తగలిన కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న షోయబ్‌కు వెంటనే మైదానం బయట మ్యాచ్ డాక్టర్, పాకిస్థాన్ ఫిజియోథెరపిస్ట్ వీబీ సింగ్ చికిత్స అందించినప్పటికీ అతడిని ఆ గాయం తాలుకా బాధ విడిచిపెట్టలేదు.
అసలు ఏం జరిగింది ?
ఇన్నింగ్స్ 32వ ఓవర్లో షాట్ కొట్టిన షోయబ్ మాలిక్ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే బంతి ఫీల్డర్ మున్రో చేతికి చేరింది. దీంతో పరుగు కోసం ప్రయత్నిస్తే ఔట్ అవుతామని, అవతలి వైపు వున్న మహమ్మద్ హఫీజ్ వారించడంతో మాలిక్ మళ్లీ వెనక్కి తిరగాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో వెనక్కి తిరిగి వెళ్తున్న మాలిక్‌ని రనౌట్ చేయాలని ఉద్దేశంతో ఫీల్డర్ మున్రో బంతిని ఎప్పటిలాగే వేగంగా వికెట్ల వైపు విసిరాడు. అయితే, ఆ బంతి కాస్తా వికెట్ల వైపే పరిగెడుతున్న మాలిక్‌ని వెనకవైపు నుంచి బలంగా తాకింది. ఈ దెబ్బతో భరించలేని బాధతో కొద్దిసేపటి వరకు గిలగిల కొట్టుకున్న మాలిక్‌కి వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఆ తర్వాత మాలిక్ తిరిగి బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. ఆ గాయం కారణంగా ఏకాగ్రత కోల్పోయిన మాలిక్ (6) ఆ వెంటనే మూడు బంతులకే ఔటయ్యాడు.