సౌతాఫ్రికా పర్యటనలో ఆ దేశంపై కేప్ టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి ఆ నేరాన్ని అంగీకరించిన స్టీవ్ స్మిత్ నిన్న గురువారం స్వదేశమైన ఆస్ట్రేలియాకు తిరిగొచ్చాకా అక్కడి మీడియా ముందు తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత మళ్లీ అంతకన్నా ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించిన " స్టీవ్ స్మిత్ బ్రేక్ డౌన్ " వీడియో ఇంటర్నెట్‌లో కొన్నిగంటల్లోనే వైరల్ అయిపోయింది. క్రికెట్‌లో తనదైన ఆటతో ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న స్మిత్ ఇలా గుక్కపెట్టి ఏడవడం సర్వత్రా చర్చనియాంశమైంది. స్మిత్ అభిమానులు అతడికి అండగా నిలిచి మద్దతు పలుకుతున్నారు. అలా మద్ధతు పలుకుతున్న వారిలో ఫేమస్ క్రికెటర్స్ కూడా వున్నారు. ఆ ప్రముఖ క్రికెటర్ల జాబితాలో మన టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకరు.
And @davidwarner31 will also need the strength to fight it out, hopefully their players union will provide them with all the support.
— Ashwin Ravichandran (@ashwinravi99) March 30, 2018
స్టీవ్ స్మిత్ కన్నీరు పెట్టుకోవడంపై వేదాంత ధోరణిలో స్పందించిన ఆర్ అశ్విన్.. అతడికి ఈ కష్టకాలంలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు అందరూ అండగా వుంటారని భావిస్తున్నాను అంటూ ట్వీట్స్ చేశాడు. " ప్రపంచం నువ్వు ఏడిస్తే చూడాలని అనుకుంటుంది. నువ్వ ఏడిచాకా ఆ తర్వాత నుంచి ఇక ఎప్పుడూ లేనంత ఆనందంగా వుంటుంది" అని వేదాంతాన్ని వల్లించాడు అశ్విన్. కేవలం స్మిత్‌పైనే కాకుండా ఈ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పరువు పోగొట్టుకున్న డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై సైతం అశ్విన్ సానుభూతి వ్యక్తంచేశాడు. ఈ ఇండియన్ క్రికెటర్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు స్మిత్ పట్ల అతడికి వున్న సాఫ్ట్ కార్నర్‌ని, అభిమానాన్ని చెప్పకనే చెబుతున్నాయి.