Samsung, LG Mobile Users at Risk: మీరు శాంసంగ్ లేదా ఎల్జీ మొబైల్స్ ఉపయోగిస్తున్నారా ? అయితే మీ ఫోన్లు మాల్వేర్ దాడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయట. ఈ మాట చెబుతోంది మేం కాదు.. జిజ్మోచైనా అనే చైనా మీడియా సంస్థ చేస్తోన్న హెచ్చరిక. ఒక ఆండ్రాయిడ్ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో లీకైందని.. ఆ ఆన్‌లైన్ సర్టిఫికెట్ ఆధారంగా శాంసంగ్, ఎల్జీ ఫోన్లు ఉపయోగించి వారి ఫోన్లలో హ్యాకర్స్ మాల్వేర్ ఇన్‌స్టాల్ చేసే ప్రమాదం ఉందని జిజ్మోచైనా హెచ్చరించింది. అదే కానీ జరిగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల ఫోన్లు మాల్వేర్ దాడికి గురయ్యే అవకాశాలు ఉన్నట్టే.
శాంసంగ్, ఎల్జీ ఫోన్ల వినియోగదారులు మాత్రమే కాదు.. మీడియాటెక్ చిప్‌సెట్స్‌తో నడిచే స్మార్ట్ ఫోన్లకు కూడా ఈ మాల్వేర్ దాడి బారిన పడే ప్రమాదం ఉందని జిజ్మోచైనా వార్తా కథనం పేర్కొంది. సైన్-ఇన్ కీ అత్యున్నత స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ హక్కులను కలిగి ఉన్నందున, హ్యాకర్స్ ఎవరైనా సార్ట్ ఫోన్ యూజర్‌కి తెలియకుండానే మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేయవచ్చని జిజ్మోచైనా స్పష్టంచేసింది. అధికారికంగా సాఫ్ట్ వేర్ అప్‌డేట్ తరహాలోనే వచ్చి మరీ మీ ఫోన్లలో చొరబడుతుందని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్, ఇతర పార్టీల నుంచి వచ్చే అప్‌డేట్స్‌కి, లింక్సుకి దూరంగా ఉంటే మంచిదని జిజ్మోచైనా హెచ్చరించింది.
ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఆండ్రాయిడ్ సర్టిఫికెట్‌తో సరిపోయే మొబైల్స్ అన్నీ రిస్కులో ఉన్నట్టేనని జిజ్మోచైనా స్పష్టంచేసింది. శాంసంగ్, ఎల్జీ, మీడియాటెక్ చిప్‌సెట్ యూజర్స్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతూ ఇప్పటికే ఆండ్రాయిడ్ టీమ్ రంగంలోకి దిగింది. శాంసంగ్‌కి కూడా ఈ విషయం తెలుసునని జిజ్మోచైనా స్పష్టం చేసింది. కీని మార్చుతూ ఆండ్రాయిడ్ సర్టిఫికెట్‌ని మారిస్తేనే ఆ ప్రమాదంలోంచి బయటపడొచ్చని జిజ్మోచైనా అభిప్రాయపడింది.