హైదరాబాద్: అధికార దుర్వినియోగం చేశారని, తనను మానసికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ దినేష్ రెడ్డిపై కేసు నమోదైంది. తనకు గతంలో అన్యాయం చేసిన ఐఏఎస్ అధికారిపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా, ఆయనను కాపాడేందుకు కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ మహిళ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సైఫాబాద్ పోలీసులు దినేష్ రెడ్డితో పాటు సీఎన్ ఆర్క్ ఎన్.ఎన్ రాజు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు విద్యాసాగర్, ఆయన భార్య కే రత్నప్రభ, పీకే మహంతి, ఎస్వీ ప్రసాద్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.13లో నివాసం ఉండే వత్సల.బి అనే మహిళకు 2011లో అప్పటి ఐఏఎస్ అధికారి ఏ విద్యాసాగర్‌తో పరిచయం ఉండేది. వీరిద్దరూ కలిసి ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరి తాలుకా రామాయపల్లిలో కొంత భూమి కొనుగోలు చేశారు. ఇళ్లు కూడా నిర్మించారు. అయితే విద్యాసాగర్ తన వాటా భూమిని విక్రయించారు. వత్సలను సైతం భూమి విక్రయించాలని కోరగా అందుకు ఆమె నిరాకరించింది. ఐఏఎస్ అయిన విద్యాసాగర్ అధికార పలుకుబడితో తపై అక్రమ కేసులు బనాయించారని వత్సల ఆరోపించారు.
తనకు మద్దతుగా నిలిచిన ప్రసాద్, వెంకటరమణ అనే వ్యక్తులపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి ఏడాదిన్నరపాటు వేధించారని తెలిపారు. విద్యాసాగర్ వేధిస్తున్నారని డీవోపీటీకి ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. అయితే విద్యాసాగర్‌కు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సాయం చేశారు. బాధితురాలికి సాయం చేయాల్సిందిపోయి విద్యాసాగర్‌కు సహకరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కొందరిపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును వత్సల ఆశ్రయించారు.