హైదరాబాద్: ప్రభుత్వాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందున్న పథకాలలో ఆరోగ్య శ్రీ ఒకటి. ఏరోజుకు ఆరోజు పొట్ట కూటి కోసం తిప్పలు పడే పేదోడికి సైతం పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రాణాంతక వ్యాధులకు కూడా వైద్య సేవలు పొందగలిగే అవకాశాన్ని అందించిన పథకం ఇది. కానీ అటువంటి ఆరోగ్యశ్రీ పథకంతోపాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద వివిధ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందించే అన్నిరకాల వైద్య సేవలు సైతం నేటి నుంచి నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద తమ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందించే ఓపీతో పాటు ఐపీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు తెలంగాణ హస్పిటల్స్ నెట్వర్క్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం నుంచి నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.1200 కోట్ల బకాయిలు అందాల్సి ఉందని.. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ.. నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని తెలంగాణ హస్పిటల్స్ నెట్వర్క్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. బకాయిల చెల్లింపు విషయంలో సర్కార్ వైపు నుంచి జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ 1 నుంచి తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ స్పష్టంచేసింది.
అసోసియేషన్ నిరసనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గురువారం రూ.150 కోట్లు విడుదల చేసినప్పటికీ.. అసోసియేషన్ మాత్రం తమ పట్టు వీడలేదని తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ సీఈవో వైఖరి కూడా అందుకు మరో కారణమని.. నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన అందుకు ఆసక్తి కనబర్చలేదని సమాచారం. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాన్ని సర్కార్ ఎలా ఎదుర్కోనుందనేదే ప్రస్తుతం చర్చనియాశంగా మారింది.