Bandi Sanjay Kumar profile: బండి సంజయ్ ప్రస్థానం.. అధిష్టానం మెచ్చిన నాయకుడెలా అయ్యారు ?

బండి సంజయ్ కుమార్.. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో (ABVP) చేరి అంచలంచలుగా ఎదిగారు. ఏబీవీపీ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు.

Last Updated : Mar 12, 2020, 06:15 AM IST
Bandi Sanjay Kumar profile: బండి సంజయ్ ప్రస్థానం.. అధిష్టానం మెచ్చిన నాయకుడెలా అయ్యారు ?

బండి సంజయ్ వ్యక్తిగత జీవితం ( Bandi Sanjay Kumar personal profile) విషయానికొస్తే... కీ.శే. బండి నర్సయ్య, శకుంతల దంపతులకు 11-7-1971న జన్మించిన ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య బండి అపర్ణ ఎస్‌బిఐ ఉద్యోగిని కాగా పిల్లలు సాయి భగీరత్, సాయి సుముఖ్ చదువుకుంటున్నారు. బండి సంజయ్ కుమార్.. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో (ABVP) చేరి అంచలంచలుగా ఎదిగారు. ఏబీవీపీ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా సేవలు అందించారు. బిజెపి జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గా, భారతీయ జనతా యువ మోర్చా (BJYM) పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా , రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు.

Read also : బండి సంజయ్ చేతికి అందుకే తెలంగాణ బీజేపి పగ్గాలు ఇచ్చారా ?

ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జిగానూ ఉన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్‌గా గెలిచారు. అదే 48వ డివిజన్ నుండి రెండవసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్... 2014 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ.. 52,000 వేలపై చిలుకు ఓట్లు సాధించి తన ఉనికిని చాటుకున్నారు.

2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓటమి చవిచూసినప్పటికీ.. 66,009 ఓట్లతో మరోసారి తన ప్రభావాన్ని చూపించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు పొందిన వారిలో బండి సంజయ్ ప్రథమ స్థానంలో నిలిచారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. అంతకు రెట్టింపు జోష్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం (Karimnagar parliament seat) బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన బండి సంజయ్.. టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొడుతూ 96,000లకు పైగా ఓట్లతో ఘనవిజయం సాధించారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన అనంతరం అవకాశం చిక్కిన ప్రతీసారి తెలంగాణ సర్కార్‌పై వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అధిష్టానం కంట్లోపడ్డారు. అంతేకాకుండా యువతలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. బండి సంజయ్ సేవలను గుర్తించిన బీజేపి అధిష్టానం.. చివరకు తెలంగాణ బీజేపికి ఆయన్నే పెద్దదిక్కుగా చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News