Bithiri Sathi Political Entry News: హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ప్రముఖ కమెడియన్ ఆర్టిస్ట్, న్యూస్ రీడర్ బిత్తిరి సత్తి సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది. బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవి కుమార్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. అందులోనూ బిత్తిరి సత్తి సామాజిక వర్గం అయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు అని అక్కడి అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అందుకే బిత్తిరి సత్తి ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ముదిరాజ్ మహాసభలో బిత్తిరి సత్తి అధికార పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం పట్ల ఘాటు వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సినిమాలు, సినిమా ఫంక్షన్స్ కి హోస్టింగ్ చేస్తూ బిజీబిజీగా ఉన్న బిత్తిరి సత్తి ముదిరాజ్ మహాసభకు హాజరవడమే కాకుండా.. ముదిరాజ్ సామాజిక వర్గానికి అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని ప్రశ్నించడం చర్చనియాంశమైంది. ఒకరకంగా చూస్తే ముదిరాజ్ మహాసభ వేదికపై నుండే ముదిరాజ్ సామాజికవర్గం వారిలో అధికార పార్టీకి వ్యతిరేకంగా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడా అనే సందేహం కూడా కలిగేలా చేసింది.
ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన సంఘాల నాయకులు, కార్యకర్తలు బిత్తిరి సత్తిని జడ్చర్ల నుండి పోటీ చేయాలని ఆహ్వానించినట్లు తెలిసింది. సొంత సామాజిక వర్గం వారే ప్రోత్సహిస్తుండటంతో బిత్తిరి సత్తి కూడా రాజకీయ ప్రవేశంపై మొగ్గు చూపిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుండి అవకాశం లభిస్తే పోటీ చేయడానికి బిత్తిరి సత్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇదే విషయమై బిత్తిరి సత్తిని సంప్రదించగా.. " జడ్చర్లకు సంబంధించిన పలువురు మిత్రులు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, పోటీ చేసే విషయంపై సమాలోచనలు చేస్తున్నాం " అని అంగీకరించారు. బిత్తిరి సత్తి కూడా ఈ వార్త నిజమేనని అంగీకరించడంతో ఇక బిత్తిరి సత్తి పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే అనే ప్రచారం జరుగుతోంది.