గోల్కొండ కోటలో నేడే బోనాలు

తెలంగాణ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలో ప్రారంభం కానుంది.

Last Updated : Jul 15, 2018, 09:41 AM IST
గోల్కొండ కోటలో నేడే బోనాలు

తెలంగాణ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలో ప్రారంభం కానుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బోనాల సందర్భంగా గోల్కొండ కోట, అమ్మవారి ఆలయం, పరిసర ప్రాంతాలను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీసంఖ్యలో తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు.

మధ్యాహ్నం లంగర్‌హౌస్‌ వద్ద తొట్టెల ఊరేగింపు మొదలవుతుంది. ఈ ఊరేగింపుకు మంత్రులు నాయిని, తలసాని హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తారు. పోత రాజుల నృత్యాలు, బ్యాండుమేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కనులపండువగా సాగిపోతాయి. తొట్టెల ఊరేగింపు లంగర్‌హౌస్‌, చెరువుకట్ట, ఫతేదర్వాజా, బడాబజార్‌,చోటాబజార్‌ల మీదుగా కోటపైకి చేరుకోనుంది. గోల్కొండ ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో భక్తులు అలరించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా దాదాపు లక్షన్నర మంది ఇవాళ జరిగే ఉత్సవాలకు హాజరవుతారన్న సమాచారంతో  గోల్కొండ కోట, ఆలయం వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు సికింద్రాబాద్ మహంకాళీ బోనాల సన్నాహాలు ఇవాళ మొదలవుతాయి. నేటి(ఆదివారం) నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు.

Trending News