BRS Party MLAs Protest: నెలకు పైగా జైల్లో మగ్గుతున్న లగచర్ల రైతుల అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టగా స్పీకర్ పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనగా దిగారు. నల్లచొక్కాలు ధరించి.. చేతులకు బేడీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 'రైతులకు బేడీలా..సీఎం, మంత్రులు జల్సాలా' అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ లోపల.. బయట గులాబీ పార్టీ సభ్యులు నిరసన చేపట్టడంతో లగచర్ల రైతులపై ప్రభుత్వ దాష్టీక చర్య ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: KTR Arrest: 'ఏ క్షణాన అయినా కేటీఆర్ అరెస్ట్'.. మరో బాంబు పేల్చిన పొంగులేటి!
లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై ప్రభుత్వం చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో అసెంబ్లీలోని మీడియా పాయింట్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనిల్ జాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాష్టీక చర్యలను తప్పుబట్టారు. రేవంత్ రెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు చేశారు. ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు
'లగచర్ల ఘటనపై చర్చకు రెండు రోజులుగా బీఆర్ఎస్ పట్టుబడినా ప్రభుత్వం పారిపోయింది. సభా నియమాలపై నీతులు చెబుతూ ప్రభుత్వమే ఉల్లంఘించింది. పాలకపక్షం ప్లకార్డులు లోపలకి తెస్తే స్పీకర్ ఎలా అనుమతించారు?' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. నిరసనల మధ్య బిల్లులు ఆమోదించుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని చెప్పారు. 'పర్యాటక రంగంపై చర్చకు తొందర ఏముంది?' అని నిలదీశారు.
లగచర్ల రైతులు జైల్లో మగ్గుతుంటే సీఎం మంత్రులు రాక్షసానందం పొందుతున్నారని ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనిల్ జాదవ్ తెలిపారు. రైతులు కన్నీరు పెడుతుంటే రేవంత్ రెడ్డి, మంత్రులు జల్సాలో మునిగి తేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల పై ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రహసనంగా మార్చేసిందని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను రేవంత్ నిర్వీర్యం చేశారని చెప్పారు.
'రేవంత్ రెడ్డి వార్తలను లీకులు ఇచ్చి బతుకుతున్నారు. కేసులు.. అరెస్టులు అంటూ నాలుగు గోడల మధ్య ఉండి రేవంత్ అడ్డగోలు వార్తలు రాయిస్తున్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి చర్చకు రావాలి. చర్చ అంటేనే రేవంత్ మొహం చాటేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చే మొహం లేదు' అని సీనియర్ నాయకుడు జగదీశ్ రెడ్డి విమర్శలు చేశారు. ఫార్ములా వన్ మీద దమ్ముంటే చర్చ పెట్టాలి అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ మోసాలపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే శాసనసభ ను పదిహేను రోజులు నడపాలని ఛాలెంజ్ చేశారు.
ప్రజాక్షేత్రంలో నొక్క లేరు
'బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతి పనిని చర్చిద్దాం. అసెంబ్లీలో మా గొంతు నొక్కవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో నొక్క లేరు' అని పేర్కొన్నారు. 'రేవంత్ రెడ్డి దొంగ రాతలు.. తప్పుడు రాతలు పత్రికల్లో రాయిస్తున్నారు. నేరుగా మమ్మల్ని ఎదుర్కునే దైర్యం లేదు' అని జగదీశ్ రెడ్డితోపాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter