CM KCR Speech at BRS Public Meeting Aurangabad: దేశం సమగ్ర సంస్కరణలతోనే అభివృద్ధి బాటలో పయనిస్తుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏర్పడిందే బీఆర్ఎస్ పార్టీ అని.. ఒక రోజు కోసమో, ఒక వర్గం కోసమో, ఒక మతం కోసమో, ఒక కులం కోసమో బీఆర్ఎస్ పార్టీ పుట్టలేదన్నారు. భారత ప్రజల హక్కుల కోసం పోరాడేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అవాంతరాలు కల్పించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. భారతదేశ గతిని మార్చాల్సిన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని.. మనం మారనంత వరకు మన స్థితిగతులు ఇలాగే ఉంటాయన్నారు. ఔరంగాబాద్‌లోని జబిందా మైదానంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
'ఈ రోజుల్లో దేశంలోని మేధావులు, బుద్ధీజీవులతో పాటు నాలోనే ఒక ప్రశ్న ఉదయిస్తున్నది. గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం కలిగిన మన దేశ లక్ష్యం ఏమిటి..? లేదా మన దేశం లక్ష్యం కోల్పోయిందా..? ఈ ప్రశ్న ఎన్నో రోజులుగా నన్ను తొలిచివేస్తున్నది. మీరు మీ మీ ప్రాంతాలకు వెళ్ళాక మీ కుటుంబ సభ్యులతో నేను చెప్పే విషయాలపై చర్చించండి. భారతదేశం లక్ష్యాన్ని కోల్పోయి ప్రయాణిస్తే చివరకు ఎటు వెళ్తాం..? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో లక్ష్యం లేని సమాజం, గమ్యం లేని దేశం పయనం చివరకు ఎటు దారి తీస్తుంది..? ఇది ఎవరు చేసిన పాపం..? అసలు దేశంలో ఏం జరుగుతున్నది..? దేశం ఇలాగే ఉండాలా..? దేశ పురోగమనానికి ఏదైనా జరగాలా..? ఇది మనందరి ముందున్న సవాల్.
దేశ సరికొత్త లక్ష్యం, చైతన్యం, ఉషోదయం, ఉత్సాహంతో ముందుకు సాగాలా లేక ఇలాగే కొనసాగాలా అనేది ఆలోచించాలి. దేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు అయింది. మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు బహుశా భారతదేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవు. గోదావరి, కృష్ణా, పెన్ గంగా, వెన్ గంగా, మంజీర, భీమా, ఘటప్రభ, పంచగంగా, మూల, ప్రవర వంటి ఎన్నో నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబాయిని రాజధానిగా కలిగిన మహారాష్ట్ర ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఎందుకుంది..? దయేసి ఆలోచించండి. ఇక్కడి ప్రజలు బంగారు ఇటుకలను, చందమామను, నక్షత్రాలను అడుగుతున్నారా..? తాగునీటిని అడుతున్నారు. దేశం ఇలాగే కొనసాగాలా..? మార్పు అవసరమా లేదా..?
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది. లక్షల ఉద్యోగాలు పోతున్నాయి. ఉద్యోగులు, శ్రామికులు రోడ్డున పడుతున్నారు. కులతత్వం, మతతత్వం, లింగబేధాలు పెచ్చుమీరిపోతున్నాయి. ధనవంతులు మరీ ధనవంతులైపోతున్నారు. ఒక్క ఏడాదిలోనే లక్షలకు లక్షల కోట్లకు అధిపతులవుతున్నారు. పేదలు మరీ పేదలవుతున్నారు. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఇవన్నీ మన కళ్ల ముందు జరుగుతున్న చేదు నిజాలు. నేను కథలు చెప్పటం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం అవసరం లేదా..?
Also Read: YS Sharmila Arrest: షర్మిలకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన సమస్యలను పరిష్కరించేందుకు అమెరికానుండో, రష్యానుండో, మరే దేశం నుండో ఎవరూ రారు. ఎంత త్వరగా మనం మేల్కొంటే అంత త్వరగా మన పురోగమిస్తాం. ఆలస్యమైతే మరెన్నో అన్యాయాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రం తెచ్చిన నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 13 నెలలపాటు దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఇది ఎంతటి దౌర్భాగ్య స్థితి..? ఇదేనా ప్రజాస్వామ్యం?.? ఈ నేపథ్యంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో ఏం తమాషా జరుగుతున్నది..? ప్రధానమంత్రి స్వయంగా క్షమాపణ చెప్పి రైతు చట్టాలను వెనక్కు తీసుకున్నారు. ఇది జరిగి మరో 13 నెలలవుతున్నా రైతులకు ఒరిగింది శూన్యం. ఇదేనా ప్రజాస్వామ్యం..? రైతులను గౌరవించుకునే తీరు ఇదేనా..?' అని సీఎం కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి