Congress MP Candidates: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానాలకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. ఇక తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో నలుగురిని ఎంపిక చేస్తూ ప్రకటన వెలువరించింది. చేవెళ్ల, జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి పరిశీలించిన అనంతరం తుది జాబితాను అధిష్టానానికి సమర్పించారు. అందరితో సంప్రదింపులు చేసిన అనంతరం నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: KT Rama Rao: తెలంగాణపై సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ, దౌర్భాగ్యం: కేటీఆర్
చేవెళ్ల: పట్నం సునీతా రెడ్డి
జహీరాబాద్: సురేష్ షెట్కార్
నల్లగొండ: కుందూరు రఘువీర్
మహబూబాబాద్: బలరాం నాయక్
Also Read: Revanth Reddy: పర్యటనలన్నీ రద్దు.. ఎంపీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్?
రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నల్లగొండ స్థానానికి కుందూరు రఘువీర్ అభ్యర్థిగా ఎంపికవడం గమనార్హం. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానా రెడ్డి కుమారుడే రఘువీర్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రఘువీర్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. జానారెడ్డి తన కుమారుడికి టికెట్ ఇప్పించడంతో సఫలీకృతుడయ్యాడు. అతడి ఇంకో కుమారుడు జయవీర్ ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే నల్లగొండ ఎంపీ టికెట్ హామీ పటేల్ రమేశ్ రెడ్డికి ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన సమయంలో పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి మరోసారి మోసం చేసింది. దీంతో రమేశ్ రెడ్డి ప్రత్యామ్నాయం చూస్తున్నారని సమాచారం.
రాజధాని హైదరాబాద్‌కు శివారున ఉన్న చేవెళ్ల స్థానానికి ఇటీవల పార్టీలో చేరిన పట్నం సునీతా రెడ్డికి అవకాశం ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీలో కీలక స్థాయిలో ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో చేరారు. చేరిక సమయంలో ఇచ్చిన హామీ మేరకు సునీతారెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి తన భార్యను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం పట్నం కుటుంబం ఎలాంటి చట్టసభలో ప్రాతినిధ్యంలో లేదు.
పార్టీ సీనియర్ నాయకులైన సురేశ్ షెట్కార్, బలరాం నాయక్‌లకు జహీరాబాద్, మహబూబాబాద్ స్థానాలను ఇచ్చారు. ఇక్కడ అంతగా ఆశావహులు లేరు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జహీరాబాద్‌లో సురేశ్‌కు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ స్థానంలో పోటీ చేస్తున్న బలరాం నాయక్‌కు కూడా గట్టి పోటీ ఎదురుకానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Candidates List: కీలకమైన 4 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. ఈసారి మళ్లీ ఆయనకు మొండిచెయ్యి