COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో శనివారం 64,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 4,298 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 6,026 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 32 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. యధావిధిగా శనివారం కూడా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 601 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 328, రంగారెడ్డి జిల్లాలో 267 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు.
శనివారం నాటి కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 5,25,007కు చేరగా.. 4,69,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,928 మంది కరోనాతో మృతి చెందారు.
ఇదిలావుంటే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో గత నెల రోజులుగా దాదాపు 74 మందికి Coronavirus సోకినట్టు అక్కడి వైద్యులు గుర్తించారు. దీంతో ఆస్పత్రిలోనే ప్రత్యేకంగా కొవిడ్ వార్డును ఏర్పాటు చేసి, కరోనా సోకిన వారిని మిగతా వారి నుంచి వేరు చేసి చికిత్స అందిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 54 మందికి కరోనా పూర్తిగా నయం కావడంతో వారిని కొవిడ్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేశారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారిని సమీపంలోని చెస్ట్ ఆస్పత్రిలో (Chest hospital) చేర్పించి చికిత్స అందేలా ఏర్పాట్లు చేయించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.