Delhi Liqour Scam: ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 14 మందికి ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. స్కాంకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా చెప్పడం సంచలనంగా మారింది. ఈ కేసులో కేంద్ర సర్కార్ కూడా సీరియస్ చర్యలకు దిగింది. ఢిల్లీ లెప్టనెంట్ గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారాంగా లిక్కర్ స్కాం జరిగిన సమయంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్న అరవ గోపికృష్ణను సస్పండ్ చేసింది.
అరవ గోపికృష్ణ తెలుగు ఐఏఎస్ అధికారి. ఎక్సైజ్ పాలసీ లైసెన్సుల వ్యవహారంలో గోపికృష్ణ పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అతనే కీలకమని సీబీఐ భావిస్తోందని తెలుస్తోంది. తెలుగు ఐఏఎస్ ద్వారానే తెలుగు రాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులు ఢిల్లీ సర్కార్ తో డీల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐఏఎస్ ఐఏఎస్ అధికారి గోపికృష్ణ తో పాటు పలువురు అధికారులను సస్పెండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం. మొత్తం 11 మంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్టు గా గుర్తించి.. సస్పెన్షన్ వేటు వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పాత్ర ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. కేసీఆర్ కూతురును కాబట్టే తనను టార్గెట్ చేశారని అన్నారు.కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే భయపడిపోతారేమోననే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని.. ఇలాంటి చర్యలకు కేసీఆర్ భయపడబోరని కవిత తెలిపారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై ఎన్నో ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాడామన్నారు. లిక్కర్ స్కాంలో ఏ విచారణకైనా తాను సిద్దమని కవిత తేల్చి చెప్పారు.
అయితే తనపై వస్తున్న ఆరోపణలను కవిత ఖండించినా.. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈ విషయంలో మౌనం ఉండటం చర్చగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేసే మంత్రి కేటీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్నది గులాబీ కేడర్ కు కూడా అర్ధం కావడం లేదు. ఓ వైపు లిక్కర్ స్కాంలో ఉన్న కవిత రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఏకంగా ఆమె ఇంటిదగ్గరే నిరసన తెలిపారు. కవిత ఇంటి దగ్గర బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్ద రచ్చే సాగింది. ఇంత జరుగుతున్నా కారు పార్టీ ముఖ్య నేతలు కవిత విషయంలో సైలెంట్ గా ఉండటం ప్రశ్నగా మిగిలింది. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యేలను కవిత విషయంలో జర్నలిస్టులు ప్రశ్నించగా.. కవితే స్పందిస్తారని చెప్పి తప్పించుకున్నారు.
కవిత విషయంలో మీడియాతో ఎవరూ మాట్లాడొద్దని హైకమాండ్ పార్టీ నేతలకు ఆదేశాలిచ్చిందనే టాక్ వస్తోంది. అదే నిజమయితే పార్టీలో కీలక నేత, సీఎం కేసీఆర్ కూతురిపై ఆరోపణలు వస్తే స్పందించవద్దని ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్నది చర్చగా మారింది. కేసులో పూర్తి వివరాలు ఇంకా తెలియదు కాబట్టే ఇప్పటికి సైలెంట్ గా ఉంటే బెటరని కారు పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read also: Komatireddy venkat Reddy: మునుగోడులో కాంగ్రెస్ గెలవదా ? బాంబు పేల్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Read also: Delhi Excise Policy Scam: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ఏపీ, తెలంగాణకు లింకులకు ఈ ఆఫీసరే కారణమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి