22న తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాక

22న తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాక

Last Updated : Oct 17, 2018, 05:44 PM IST
22న తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాక

కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది.

అక్టోబర్ 22న రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం భేటీ కానుంది. అదే రోజు సీఈసీ, అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో.. 24న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.

కలెక్టర్లతో సీఈఓ రజత్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌

అటు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్ల జాబితా విడుదల, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలు, నగదు లావాదేవీలు, మద్యం సరఫరా నిఘాపై సీఈఓ చర్చించారు. దసరా తరువాత రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం వస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై నివేదిక సమర్పించడం తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు.

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్ 7న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. నవంబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. నామినేషన్ల దాఖలకు తుది గడువు నవంబర్ 20 అని, నామినేషన్ల పరిశీలన నవంబర్ 20న, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 22వ తేదీ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Trending News