ఇకపై ప్రభుత్వ టీచర్లే ఆ పని చేయాలి : కడియం

Last Updated : Feb 18, 2018, 12:33 AM IST
ఇకపై ప్రభుత్వ టీచర్లే ఆ పని చేయాలి : కడియం

10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్ష పేపర్లు దిద్దేందుకు ఇకపై పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలనే వినియోగించుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు జారీచేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్షల నిర్వహణపై శనివారం నాడు విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కడియం.. ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో పరీక్షల నిర్వహణకై అవసరమైన ఫర్నిచర్, తదితర ఏర్పాట్లు, సౌకర్యాలపై మంత్రి అధికారులని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు అసౌకర్యాలు తలెత్తకుండా వుండేందుకు వీలైనంత వరకు పరీక్ష కేంద్రాలు అక్కడే ఏర్పాటు చేసే అవకాశాలని పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థలు, మైనార్టీ సంస్థలు, ఇతర విద్యాలయాల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పేపర్లు దిద్దడంలోనే కాకుండా పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లను కూడా వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులనే నియమించాల్సిందిగా మంత్రి కడియం స్పష్టంచేశారు.

Trending News