కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన గండ్ర.. కేటీఆర్‌ని కలిసిన గండ్ర దంపతులు

కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన గండ్ర వెంకటరమణా రెడ్డి

Updated: Apr 23, 2019, 10:37 AM IST
కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన గండ్ర.. కేటీఆర్‌ని కలిసిన గండ్ర దంపతులు

జయశంకర్ భూపాలపల్లి: ఊహించిందే జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా పేరున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్లు స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన గండ్ర.. అనంతరం టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామా రావుతో సమావేశమయ్యారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు గండ్ర అధికారికంగానే ప్రకటించారు. 

కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న సందర్భంగా తన మనోగతాన్ని వెల్లడిస్తూ మీడియాకు ఓ లేఖ విడుదల చేసిన గండ్ర.. భూపాలపల్లి జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని గండ్ర అభిప్రాయపడ్డారు. గండ్ర వెంకటరమణా రెడ్డితోపాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పి వీరయ్య సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్టు గత రెండు రోజులుగా మీడియాలో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.