వాట్సాప్‌లో భార్యకి తలాక్ చెప్పిన భర్త

వాట్సాప్‌లో భార్యకి తలాక్ చెప్పిన భర్త

Last Updated : Sep 19, 2018, 11:25 AM IST
వాట్సాప్‌లో భార్యకి తలాక్ చెప్పిన భర్త

తలాక్ అని మూడుసార్లు వెనువెంటనే చెప్పి భార్యకు భర్త విడాకులివ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పినా చాలా మందిలో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితురాలు (29).. ఒమాన్ దేశస్థుడైన తన భర్త వాట్సాప్‌లో తలాక్ ఇచ్చాడని అంది.

మే, 2017లో 62 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు బాధితురాలు వార్తా సంస్థ ఏఎన్ఐకి చెప్పింది. వివాహం తర్వాత ఒమాన్‌లో స్థిరపడినట్లు.. అక్కడే సంవత్సరం నివసించినట్లు చెప్పింది.

"నేను అక్కడికి (ఒమాన్) వెళ్లాక నా భర్త నన్ను వేధించడం మొదలుపెట్టాడు. కాని నేను పరిస్థితులతో రాజీపడి అతనితో ఉన్నాను. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చాను. కానీ ఆ బిడ్డ అనారోగ్యంతో మరణించింది. బిడ్డ ఇక లేనందున అతడు నన్ను వదిలేస్తాడన్నాడు" అని ఆమె చెప్పింది. భర్త తనను జూలై 2018లో హైదరాబాద్‌కు పంపించి, తర్వాత వాట్సాప్‌లో విడాకులు పంపాడని బాధితురాలు చెప్పింది.

"2018 జూలై 30న మెడికల్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌లోని నా తల్లివద్దకు పంపించాడు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు అతను 14 ఆగస్టు 2018న వాట్సాప్ ద్వారా నాకు తలాక్ ఇచ్చాడు. ఇదేంటని నేను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు" అని ఆమె చెప్పింది.

దాంతో ఇప్పుడు ఆమె విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకోవాలని కోరింది. "సహాయం చేసేందుకు నేను సుష్మా స్వరాజ్ మేడంను అభ్యర్థించాను" అని బాధితురాలు వివరించింది.

"నా భర్త లాంటి వాళ్లు పేద మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్లు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని.. తర్వాత తలాక్ ఇస్తున్నారు." అని ఆమె చెప్పింది.

Trending News