తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికులు ఈనెల 11 నుంచి తలపెట్టిన సమ్మెను తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కోరారు. ఆర్టీసీ యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గురువారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒకసారి సమ్మెకంటూ వెళ్తే ఇప్పుడున్న నష్టాలకు తోడు అదనంగా రోజుకు కోటిన్నర రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని సీఎం అన్నారు.
సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. రూ.700 కోట్ల అప్పుల్లోని సంస్థను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టగా.. కార్మికులు ఇలా జీతాల పెంపుకు సమ్మె చేయడం బాధ్యతా రాహిత్యమన్నారు. సమ్మె నిషేధ కాలంలో ఈ చర్యకు పూనుకుంటే కార్మికులు ఉద్యోగాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. సమ్మెకంటూ పోతే టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తించుకోవాలన్నారు. భవిష్యత్తులో సంస్థను లాభాల్లో నడిపించమని సూచించినా ఇప్పటికీ ఫలితం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది.
సమ్మె చేస్తే ఉద్యోగం కోల్పోతారు: కేసీఆర్