Kavitha: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మరోసారి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే పలుమార్లు విచారణ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తాజాగా అరెస్ట్ చేయడంతో అసలు కవిత ఏం చేసింది? ఆ కేసు ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారాయి. కవిత అరెస్టయిన కేసు 'ఢిల్లీ మద్యం కుంభకోణం'. దేశవ్యాప్తంగా ఈ కుంభకోణం కీలక పరిణామాలకు దారి తీసింది. ఇప్పటికే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నాయకులు అరెస్టయ్యారు. ఇంతలా ప్రభావం చూపిన ఈ కేసు ఏమిటనేది? ఆసక్తి నెలకొంది.
Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు
ఢిల్లీ మద్యం విధానం ఇదే..
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం 2021లో కొత్త మద్య విధానం తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా 'మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం' అనేది ఉంది. 'సుదీర్ఘ కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలి' అని కొత్త విధానంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ.9,500 కోట్లు ఆదాయం వస్తుంది' అని ప్రభుత్వం భావించింది. ఈ విధానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపింది. నాలుగు నెలలు తన వద్ద ఉంచుకున్న తర్వాత నవంబర్ 2021లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విధానం ద్వారా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచి ఉంచడం కొత్త విధానంలో జరిగిన భారీ మార్పు. మద్యం హోం డెలివరీ చేసే సదుపాయం కూడా వచ్చింది.
Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి
మద్యం విధానం అమలైన తర్వాత ఏప్రిల్ 2022లో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నరేశ్ కుమార్ నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన 'కొత్త మద్యం విధానం'పై సమీక్ష చేశారు. ఈ విధానంలో అవకతవకలు జరిగాయని గుర్తించారు. మద్యం దుకాణాల కేటాయింపులో తప్పులు జరిగినట్లు సీఎస్ నరేశ్ కుమార్ నివేదించారు. ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ విధానం తీసుకొచ్చారని నిర్ధారించారు. ఈ విషయాలన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. జూలై 2022లో ఈ మద్యం విధానంపై విచారణ చేయాలని సీబీఐకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మద్యం కుంభకోణం బయటపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మద్యం విధానాన్ని కొన్ని నెలలకు ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ సీబీఐతోపాటు ఈడీ రంగంలోకి దిగి ఆ కుంభకోణంలో విచారణ చేపట్టాయి. ఆ విచారణ నేటి కవిత అరెస్ట్ వరకు వరకు దారి తీసింది.
ఆరోపణలు ఇవే..
- మద్యం దుకాణాలు కొందరికే దక్కేటట్టు చేశారు.
- నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలకు కొందరికే కేటాయింపు
- మద్యం విధానంలో మార్పులు చేయడంతో నాటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రూ.145 కోట్లు నష్టం చేశారు.
- మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.145 కోట్ల ధనాన్ని కరోనా పేరు చెప్పి ప్రభుత్వం మాఫీ చేసింది.
- ప్రతీ బీర్ కేసుపై చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీనీ కూడా ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసింది.
- ఎల్-1 కేటగిరి లైసెన్సుల జారీలో అవినీతికి పాల్పడి అనుమతుల జారీ.
- రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ.
- మనీష్ సిసోడియా తన అనుచరులు దినేశ్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలతో అవినీతికి పాల్పడ్డారు.
ఈ కుంభకోణం కేసులో ఈడీ రంగ ప్రవేశం చేసి తొలిగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు అరెస్ట్. అనూహ్యంగా కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. రెండు సార్లు స్వయంగా ఢిల్లీలో కవిత విచారణకు హాజరయ్యారు. పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు పంపినా కవిత రాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ కేసు తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కవితను అకస్మాత్తుగా ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ చట్టం 2022 (15 ఆఫ్ 2003) కింద అరెస్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter