హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు పార్టీ మారుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శాసనసభా పక్షం అత్యవసరంగా సమావేశమైంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సబిత ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, సుధీర్ రెడ్డి, జగ్గా రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, సురేందర్ ఈ భేటీకి హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా ఉపేందర్ రెడ్డి, నగరంలో అందుబాటులో లేనందున తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈ భేటీకి హాజరుకాలేకపోయారు. ఇదిలావుండగా ఈ భేటీకి హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎల్పీ సమావేశం మధ్యలో నుంచే బయటికి వెళ్లిపోయారు. బయటికు వచ్చిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. బలమైన నాయకత్వం ఇవ్వాల్సిందిగా తాను ఎన్నికలకు ముందే అధిష్టానానికి విజ్ఞప్తి చేశానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని అన్నారు. ఎన్నికలకు ముందు చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించలేకపోయామని, తమలాంటి వారిని కూడా టికెట్ల కోసం ఆఖరి వరకు వేచిచూసేలా చేశారని మండిపడ్డారు.
ఇకనైనా నాయకత్వాన్ని మార్చకపోతే కష్టం అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి... అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వం ఆధ్వర్యంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రావడం లేదని విమర్శించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు గెలుచుకుంటామని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.