హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరపున భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతకన్నా ముందుగా ఇవాళ శనివారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో సాగునీరు, తాగు నీరు సమస్యలపై ఆయన కేసీఆర్‌తో చర్చించిన సందర్భంలోనే.. ''ఆలేరు సమస్యలపై చర్చించేందుకు తన నివాసానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారు''అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించినట్టు సమాచారం. రానున్న మరో మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అవుతానని కోమటిరెడ్డి ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో రెబల్‌గా పేరున్న నేతల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ పీసీసీని మార్చాలని, ప్రస్తుతం ఉన్న నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ఏ విజయాలు సాధించలేదని అధిష్టానానికి ఎప్పటికప్పుడు తన ధిక్కారస్వరాన్ని వినిపిస్తూ వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకానొక దశలో బీజేపీలో చేరతారా అనే ప్రచారం కూడా జరిగింది.
ఇక టీఆర్ఎస్ పార్టీతో కోమటిరెడ్డి సమీకరణల విషయానికొస్తే, గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. అధిష్టానం అనుమతిస్తే, గజ్వెల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయడానికైనా తాను సిద్ధమే అని బహిరంగంగా ప్రకటించిన కాంగ్రెస్ వాది కోమటిరెడ్డి. ఈ కారణంగానే కేసీఆర్-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య భేటీపై జనాల్లో ఆసక్తి ఏర్పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.