మిర్యాలగూడలో హత్య ఘటనపై కేటీఆర్ స్పందన

తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతంలోని జరిగిన ప్రణయ్ హత్య ఘటనపై తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. 

Last Updated : Sep 16, 2018, 10:40 PM IST
మిర్యాలగూడలో హత్య ఘటనపై కేటీఆర్ స్పందన

తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతంలోని జరిగిన ప్రణయ్ హత్య ఘటనపై తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తన కుమార్తెను వేరే కులం వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో తిరునగరి మారుతీరావు అనే బిల్డర్.. రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి మరీ తన అల్లుడిని హత్య చేయించాడు. ఈ ఘటనపై కేటీఆర్ మాట్లాడుతూ "మిర్యాలగూడలో కులం పేరుతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. కులం పేరుతో కొందరు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం చూస్తే చాలా ఆవేదనతో పాటు కోపం కూడా కలుగుతుంది.

తప్పకుండా ఈ ఘటనలో తప్పు చేసిన వారికి న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. అంతిమంగా న్యాయం మాత్రమే గెలుస్తుంది. ఈ ఘటనలో మరణించిన ప్రణయ్ తల్లిదండ్రులకు, ఆయన భార్య అమృతకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే తిరునగరి మారుతీరావుతో పాటు అతని తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంను పోలీసులు అరెస్టు చేశారు. 

అలాగే ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి గురించి కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బీహార్ నుండి ఆ వ్యక్తిని మారుతీరావు రప్పించినట్లు తెలుస్తోంది. నిన్నే మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆయన తానే ఈ హత్య చేయించినట్లు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ‘‘నా కూతురు జోలికి రావద్దని ఎన్ని సార్లు చెప్పినా ప్రణయ్‌ వినలేదు. అతన్ని హత్య చేయించినందుకు నాకు ఎలాంటి బాధలేదు. వారి ప్రేమ కంటే సొసైటీలో నా పరువు, స్టేటస్ ముఖ్యమని అనుకున్నాను. అందుకే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడే అతన్ని హత్య చేయించాను’’ అని మారుతీరావు తెలిపినట్లు సమాచారం. 

Trending News