తెలంగాణ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి హల్‌చల్ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పటేల్ రోడ్డుకు చేరుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. చిరుత పులి రావడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి పటేల్ రోడ్డుకు వచ్చిన చిరుత.. మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపైకి ఎక్కి దాక్కుంది. పూల కుండీల మధ్యలో నిద్రించింది. పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉంది. చాలా రోజులుగా చిరుతపులి అక్కడే సంచరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదిగో పులి ఇదిగో పులి అన్నట్టు మాత్రమే అందరూ అనుకున్నారు. కానీ నిజంగా చిరుతపులి షాద్‌నగర్ పట్టణంలోని నగర నడిబొడ్డులో ప్రత్యక్షం కావడంతో జనం భయాందోళన చెందారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు అటవీ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఎస్ఐ కృష్ణ, విజయ భాస్కర్ రెడ్డి తదితర సిబ్బంది పటేల్ రోడ్డుకు చేరుకున్నారు. చిరుత పులిని చూడడానికి జనాలు ఎగబడ్డారు. మరోవైపు పటేల్ రోడ్డులో భయానక వాతావరణం నెలకొంది. అటవీ సిబ్బంది వచ్చే వరకు పోలీసులు .. జనాలను నియంత్రించారు. చిరుత భయానికి గురి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత అటవీ సిబ్బంది తమదైన శైలిలో చిరుతను బంధించి .. అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో షాద్ నగర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.