Secunderabad Agnipath Protests Live Updates: 'అగ్నిపథ్' మంటలు తెలంగాణలోనూ రాజుకున్నాయి. శుక్రవారం (జూన్ 17) ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పలువురు ఆందోళనకారులు మొదట పట్టాలపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. పలు రైళ్ల భోగీలతో పాటు పార్శిళ్లకు నిప్పంటించారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరపగా.. కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 10 గంటల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత కొనసాగింది. చివరకు పోలీసులు పరిస్థితిని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. నిరసనకారులను అదుపులోనికి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ను క్లియర్ చేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో హింసాత్మక ఘటనలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం...