Manipur Violence News Updates: మణిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం స్పెషల్ ఫ్లైట్

Manipur Violence News Updates: ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, తెలంగాణకి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్‌తో పాటు అక్కడి పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడం, అనేక జిల్లాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటంతో ఆ విద్యార్థులు అంతా బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2023, 10:36 PM IST
Manipur Violence News Updates: మణిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం స్పెషల్ ఫ్లైట్

Manipur Violence News Updates: హైద్రాబాద్ : మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో మణిపూర్‌లోని విద్యా సంస్థల్లో చదువుకుంటూ అక్కడే చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు, ఇతర తెలుగు ప్రజల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ ప్రారంభించినట్టు తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. 

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, తెలంగాణకి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్‌తో పాటు అక్కడి పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొనడం, అనేక జిల్లాల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటంతో ఆ విద్యార్థులు అంతా బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. తాజాగా వస్తున్న మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే 54 మంది ఈ హింసకు బలైనట్టు వార్తలొస్తున్నాయి. దీంతో అక్కడ చిక్కుకున్న తమ పిల్లల కోసం వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

దీంతో తెలంగాణ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వారిని ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. రేపు.. అంటే మే 7న ఉదయం ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు ఈ ప్రత్యేక విమానం బయల్దేరనుంది. 

ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటున్నారు. మణిపూర్‌లోని తెలంగాణ ప్రజలు / విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాల అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ డీజీపీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

Trending News