తెలంగాణ ముందస్తు శాసన సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల లేఖ ఒకటి కలకలం రేపుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు లేఖ రాశారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తోడుదొంగలుగా మారాయని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ పేరు మీదుగా ఈ లేఖ విడుదలైనట్లు సమాచారం. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదలైంది.
ఈ లేఖలో.. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోపిడీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని.. ఆ సర్కార్ నాలుగేళ్ల పాలనలో ప్రజల హామీలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణ జనసమితి కూడా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని, దాన్ని నిరసించాలని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని, బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నెలకొన్న కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. తప్పుడు ఆరోపణలు, అభియోగాలతో అరెస్టైన రాజకీయ నేతలను విడుదల చేయాలని.. ధర్నాచౌక్ ను పునరుద్దరించాలని లేఖలో డిమాండ్ చేస్తూ.. ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందని లేఖలో హరిభూషణ్ స్పష్టం చేశారు.