Meadaram Jathara 2023 Dates: ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క సారాలక్క మినీ జాతరకు తేదీలను ఖరారు చేస్తూ మేడారం దేవాలయం కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2023 ఆరంభంలో సమ్మక్క, సారాలక్క అమ్మవార్లకు ఘనంగా నిర్వహించే జాతర తేదీలను అమ్మవార్ల పూజారులు ఈ ప్రకటన ద్వారా వెల్లడించారు. మేడారం దేవాలయం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల (వడ్డెల) సంఘం సమావేశమైంది.
మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే ఫిబ్రవరి మాఘమాసంలో నిర్వహించే మేడారం జాతర పండగ తేదీలు, ఏర్పాట్లపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మండ మెలిగే మినీ మేడారం జాతర తేదీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన మేడారం ఈవో, పూజారుల సంఘం.. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
మేడారం ఈవోతో కలిసి పూజారుల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మండ మేడారంలో మేడారం జాతర నిర్వహించనున్నారు. మేడారం జాతర నిర్వహణ విషయంలో అనాదిగా వస్తోన్న ఆచారం ప్రకారం పూజారులదే కీలక పాత్ర కావడంతో వారితో భేటీ అయిన అనంతరమే మేడారం జాతరపై ఈవో కార్యాలయం నుంచి ప్రకటన వెలువడుతుందనే విషయం తెలిసిందే.