Minister Harish Rao Speech: సీఎం కేసీఆర్ సంకల్పం ప్రకారం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వస్తే ఈ దేశంలో వైద్య విద్యకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అవుతుందని, వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లడం బదులు తెలంగాణకు వస్తారని చెప్పారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, ఇక్కడి విద్యార్థులకు వైద్య విద్య మరింత చేరువ అవుతుందన్నారు. టీచింగ్ ఆసుపత్రుల నెల వారీ సమీక్షలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నూతనోత్సాహంతో పని చేయాలని, పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానానికి వచ్చేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్, వైద్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం కావాల్సిన మెడికల్ కాలేజీలు, వైద్యుల పోస్టులు, వైద్య పరికరాలు అన్నీ మంజూరు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మంత్రి హరీశ్ రావు గారు సూచించిన అంశాలు
65 మందికి ప్రొఫెసర్లకు, 210 అసోసియేట్ ప్రొఫెసర్లగా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ పూర్తయి, నియామక ఉత్తర్వులు ఈ నెల 22 శిల్ప కళా వేదికలో జరిగే కార్యక్రమంలో ఇవ్వడం జరగుతుంది. కాబట్టి వీరందరి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలి.
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు వచ్చారు. వారికి రోల్ మోడల్ గా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి. క్రమశిక్షణ గా ఉండేలా చూడాలి. ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలి. విద్యార్థుల మానసిక స్థితిని తెలుసుకోవాలి. మానసికంగా బలంగా ఉండేలా చూడాలి. ప్రజల ప్రాణలు కాపాడే ఒక గొప్ప వృత్తిలో అడుగు పెట్టబోతున్న విషయాన్ని వారికి వివరించాలి. వారిలో ఉత్సాహం నింపాలి.
ప్రతి మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు మానసిక ఒత్తిడి నుండి బయటకు వచ్చే విధంగా యోగా, ప్రాణాయామం వంటి తరగతులను ప్రారంభించాలి. వారికి ఇలాంటి ప్రత్యేక శిక్షణ ఇస్తే ఒత్తిడి నుండి బయటపడేందుకే కాకుండా చదువులో కూడా ఉపయోగపడుతుంది.
800 మంది పీజీ SR లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రులకు అవసరం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఎక్కువగా జిల్లాల్లో వీరిని కేటాయించడం జరిగింది. వీరి సేవలు సద్వినియోగం చేసుకోవాలి.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఒక ఏడాది ఇంటర్న్ షిప్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇవ్వడం జరిగింది. వారికి అవగాహన కల్పించి వారి సేవలను వినియోగించుకొని ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించాలి.
క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెండెంట్స్ దే పూర్తి బాధ్యత. రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలి. అవసరం అయితే తప్ప రెఫర్ చేయకూడదు. స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందాలని మనం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.
24 గంటలు మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్లు ఉండాలి. ముఖ్యంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో డ్యూటీ కచ్చితంగా ఉండాలి. తద్వారా రాత్రి వేళల్లో వచ్చే ఎమర్జెన్సీ కేసులకు వైద్యం అందించే అవకాశం ఉంటుంది.
తెలంగాణ ఏర్పాటు అయినంక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది అదేవిధంగా సి సెక్షన్ లు తగ్గించడంలో తెలంగాణ ఆరోగ్యశాఖ కృషి చేసింది. అవసరమైతే తప్ప సి సెక్షన్లు చేయకూడదు. వాటిని మరింత తగ్గించేందుకు డాక్టర్లు కృషి చేయాలి.
ముహూర్తాలు చూసి ప్రసవాలు చేయకూడదు. గర్భిణీల ఆరోగ్య పరిస్తితిని బట్టి సాధారణ లేదా సీ సెక్షన్ డెలివరీ చేయాలి.
అదే విధంగా బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే తల్లి ఆనందంగా ఉంటుంది కాబట్టి మొదటి గంటలో తలి పాలు బిడ్డకి అమృతంతో సమానం కాబట్టి తల్లిపాలు పట్టిస్తే రోగనిరోధక శక్తి పెరిగి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అలా మొదటి గంటలో తల్లిపాలు అందే విధంగా డాక్టర్లు చూడాలి.
కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి ఆ గర్భిణీ ప్రతీ నెలా అమ్మ ఒడి వాహనం ద్వారా కరిపించు కొని నెలవారీ చెకప్ చేయాలి. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్తితిని అంచనా వేస్తూ ఆరోగ్యకరమైన ప్రసవం జరిగేలా చూసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించాలి. అతి తక్కువ మతా శిశు మరణాల్లో మన రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉంది. ఇంకా కృషి చేసి మొదటి స్థానంలో నిలిచే విధంగా పని చేయాలి.
ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ విషయంలో ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసాము. ప్రతి సోమవారం కమిటీ మానిటరింగ్ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేలా చూడాలి.తగిన జాగర్తలు తీసుకొని సురక్షితంగా వారిని ఇంటికి పంపాలి .
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో సేవలను మరింత మెరుగుపరచాలి. ఇప్పటికే అవసరమైన అన్ని పరికరాలను ఏర్పాటు చేశాము కాబట్టి జిల్లాలోనే ఆర్థో సర్జరీలు పెరిగినట్లయితే హైదరాబాదులో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గాంధీ, నిమ్స్, ఉస్మానియాలపై లోడ్ తగ్గుతుంది. తద్వారా మెరుగైన వైద్యం అందించవచ్చు.
జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఈ వైద్య సేవతో పాటు కొంచెం ప్రేమ ఆప్యాయత జోడించి పేషంట్లకు చూపించినట్టయితే మరింత మెరుగైన రిజల్ట్ వస్తాయి. పేషెంట్ కేర్ కోసం పేషన్ సపోర్టింగ్ స్టాప్ కానీ డాక్టర్లు గానీ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి చికిత్స అందించాలి.
ఎన్ఎంసి నిబంధనల ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ ల పైన ఉంది. తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగిన సందర్భాల్లో అవయవ దానం దిశగా ప్రయత్నాలు చేయాలి. అవయవ దానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలి.
ఎక్విప్మెంట్ నిర్వహణ విషయంలో పీఎంయు ఏర్పాటు చేసుకున్నాం. ఐదు లక్షల రూపాయలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరిచాలి. అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదే.
కొత్త మెను ప్రకారం డైట్ అందుతుందా లేదా తరుచూ చెక్ చేయండి. బోర్డులు ఏర్పాటు చేయండి. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలం కాబట్టి పేషెంట్లు, రోగి సహాయకులకు తాగు నీటి సమస్య లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి ,కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాస రావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంఛార్జి కమిషనర్ రమేష్ ,TSMSIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డిఅన్ని జిల్లా ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.