తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జనసేన పార్టీలో చేరబోతున్నారా? పవన్ కళ్యాణ్ ఆయన్ను ఆహ్వానించి పార్టీ కండువా కప్పనున్నారా? అవువనే సమాధానం వినిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం మోత్కుపల్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవనున్నారని తెలిసింది. దాంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ మోత్కుపల్లి పార్టీలో చేరితే ఆయనకు జనసేనలో కీలక పదవి ఇచ్చే అవకాశముంది.
కొద్ది రోజుల క్రితం మోత్కుపల్లిని తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని.. ఆయన తన సంపాదనంతటిని విదేశాలకు తరలిస్తున్నారని, ఆయన ఆస్తుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఆయన హస్తముందనే వార్తలు నిజమని అన్నారు.
అయితే మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారని గతంలోనూ వార్తలు వచ్చాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నివాసానికి వెళ్లి కలిసి వచ్చారు. అయితే మోత్కుపల్లి ఇతర పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన గానీ, ఆయన అనుచర వర్గం గానీ దీనిపై స్పందించడం లేదు.