MLA Rajaiah Vs MLC Kadiyam Srihari: స్టేషన్ ఘణపురంలో ఎమ్మెల్యే రాజయ్య vs ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నట్టుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు అండగా నిలబడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణమని మందకృష్ణ ఆరోపించారు. కడియం శ్రీహరి ఓ గుంట నక్క అని మందకృష్ణ మాదిగ ద్వజమెత్తారు. .
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ స్థాయి మాదిగల అస్తిత్వ ఆత్మ గౌరవ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మందకృష్ణ మాదిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, " కడియం శ్రీహరి గుంటనక్క లాంటోడు " అని నిప్పులు చెరిగారు. మందకృష్ణ మాట్లాడుతూ గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణం కడియం శ్రీహరినని ఆరోపించారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో మండిపడిన మందకృష్ణ మాదిగ.. కడియం శ్రీహరికి టికెట్ ప్రకటించగానే సరిపోదని.. బీఫామ్ కూడా రావాలి కదా.. అది ఎలా వస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. రాజయ్యపై ఈ మధ్యకాలంలో వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఆ కుట్రల వెనుకాల ఉన్నది కడియం శ్రీహరేనని, కుట్ర దారి, పాత్రధారి సూత్రధారి అన్నీ కడియం శ్రీహరి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో 99 శాతం ప్రజలు రాజయ్యకు టిక్కెట్ కావాలని కోరుతున్నారని ఒకవేళ రాజయ్యకు ఇవ్వని పక్షంలో మరొక మాదిగ బిడ్డలకే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, రాజయ్య సైతం సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా కడియం శ్రీహరిపై నిప్పుడు కక్కుతున్న సంగతి తెలిసిందే. తాను మొట్లు తీసి, దుక్కి దున్ని, నీళ్లు కట్టి వ్యవసాయం చేస్తే.. చివరకు ఎవరో వచ్చి కుప్పపై కూర్చుంటామంటే ఎలా అంటూ పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.